
బద్వేల్ / కడప (పొలిటికల్ పవర్ / పి యన్ 9టీవీ తెలుగు న్యూస్, కడప జిల్లా బ్యూరో – ఎం. వెంకటేశ్వర్లు):
కడప జిల్లాలో బియ్యం వ్యాపారుల అక్రమ దోపిడీ రోజురోజుకూ శృతిమించుతోందని, తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడప జిల్లా వ్యాప్తంగా బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లు యజమానులు ఏకమై కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
రూ. 1,400 ఉన్న ప్యాకెట్ నేడు రూ. 3,500!
గత నెల రోజు క్రితం 25 కేజీల బియ్యం ప్యాకెట్ ధర రూ. 1,400 ఉండగా, నేడు వ్యాపారులు సిండికేట్‌గా మారి ఏకంగా రూ. 2,500 నుండి రూ. 3,500 వరకు విక్రయిస్తున్నారని చిన్ని ఆరోపించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కనబెట్టి, ఒక్కో ప్యాకెట్‌పై వెయ్యి రూపాయలకు పైగా అదనంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు… ఇప్పుడు తినే తిండి కోసం కూడా నరకం చూడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
నెల రోజుల వ్యవధిలో బియ్యం ధరల వ్యత్యాసం (25 కేజీల ప్యాకెట్):
• గత నెల ధర : ₹ 1,400
• ప్రస్తుత ధర : ₹ 2,500 నుండి ₹ 3,500 వరకు
• అక్రమ మార్జిన్: ₹ 1,000 కంటే ఎక్కువ!
కల్తీ బియ్యం.. అక్రమ నిల్వలు!
జిల్లాలోని ప్రతి పట్టణంలో పదుల సంఖ్యలో ఉన్న రైస్ ట్రేడర్లు, మిల్లు యజమానులు అక్రమ వ్యాపారంతో కోట్ల రూపాయలు మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం పేదలకు అందించే చౌక బియ్యాన్ని (రేషన్ బియ్యం) తక్కువ ధరకు కొనుగోలు చేసి, కల్తీ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. వ్యాపారులు గోడౌన్లలో బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలిపారు.
అధికారుల ఉదాసీనతపై మండిపాటు
ఇంత జరుగుతున్నా పౌర సరఫరా శాఖ అధికారులు, స్థానిక తహసీల్దార్లు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నించారు. అధికారుల ఉదాసీనతే బియ్యం మాఫియాకు వరంలా మారిందని దుయ్యబట్టారు.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి – DYFI హెచ్చరిక
ప్రజల పొట్ట కొడుతున్న బియ్యం మాఫియాపై జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

