ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివిద్యాపర్తి వనపర్తికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు

విద్యాపర్తి వనపర్తికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు

📰 Generate e-Paper Clip

రూ.241 కోట్లతో వనపర్తి ఐటీఐ హబ్ అభివృద్ధికి శ్రీకారం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 6 2026: రాష్ట్రంలో విద్యాపర్తిగా గుర్తింపు పొందిన వనపర్తి జిల్లా పారిశ్రామిక విద్య, నైపుణ్యాభివృద్ధి రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో చేపట్టిన క్లస్టర్–8 అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్ (AIP) ప్రాజెక్టుకు రూ.241 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో వనపర్తి ప్రభుత్వ ఐటీఐని హబ్‌గా ఎంపిక చేయడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. వనపర్తి హబ్ పరిధిలో మన్ననూరు, మహబూబ్‌నగర్ బాలికల ఐటీఐ, దిండి, గద్వాల ప్రభుత్వ ఐటీఐలను అనుసంధానించి సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వనపర్తి రాష్ట్రంలోనే ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రంగా అవతరించనుంది. ఈ ప్రాజెక్టు అమలుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ప్రయోగశాలలు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ వంటి కొత్త కోర్సులు ప్రారంభించనున్నారు. పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌లు, క్యాంపస్ నియామకాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి. ప్రభుత్వంతో కలిసి ఎంపికయ్యే పరిశ్రమ భాగస్వామి ఐదేళ్లపాటు ఈ క్లస్టర్‌ను నిర్వహిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ నాణ్యత పెంపు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువత తయారీపై దృష్టి సారించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ యువత స్థానికంగానే ప్రపంచ స్థాయి శిక్షణ పొందే అవకాశం లభించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించే అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… వనపర్తిని విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మంజూరుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఇంచార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ.241 కోట్లతో చేపట్టనున్న ఈ ఐటీఐ హబ్ ప్రాజెక్టు వనపర్తి విద్యా, నైపుణ్యాభివృద్ధి చరిత్రలో మరో కలికితురాయిగా నిలుస్తుందని, టెండర్ ప్రక్రియ ప్రారంభం కావడం అభివృద్ధి దిశగా కీలక అడుగని ఎమ్మెల్యే తెలిపారు. “విద్యాపర్తి”గా వనపర్తి ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే చారిత్రాత్మక ప్రాజెక్టుగా ఇది నిలవనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!