లంబోదరుడి రాకతో పల్లెపల్లెనా పండుగ వాతావరణం.
భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న జనసందోహం.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగుదీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లామదనాపురం మండలం తీర్మలాయపల్లి గ్రామంలో వాడవాడలా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. గణనాథుడి ప్రతిమలను ప్రతిష్ఠించిన భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. వీధి వీధినా ప్రతిష్టించిన బొజ్జ గణపయ్య కొలువుదీరడంతో వేదమంత్రాలు, భక్తి గీతాల మారుమోతలతో వీధులన్నీ శోభాయమానంగా మారాయి. ఎక్కడ చూసినా పూజల కోలాహలం, నైవేద్యాల సువాసనలు, హారతుల కాంతులతో ప్రతి గల్లీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తలపిస్తోంది. వీధులు, కాలనీలు వినాయక మండపాలతో పండుగ శోభను సంతరించుకున్నాయి. చిన్నారులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో వీధులు మార్మోగుతున్నాయి. ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచే సుప్రభాత సేవలు, ప్రత్యేకాభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్రనామ పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి.
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక విశేషాలు:సాయంత్రం కాగానే రంగురంగుల విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తున్న మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంటోంది. సాయంత్రం వేళల్లో నిర్వహించే మహా హారతులు,తీర్థప్రసాద వితరణలో గ్రామ ప్రజలు పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. భజనలు,ఆధ్యాత్మిక ప్రవచనాలు, పిల్లలకు వేషధారణ పోటీలు, కోలాటాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఉత్సవ వాతావరణం పండగ శోభను సంతరించుకుంది.ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఆ విఘ్న వినాశకుని కృపాకటాక్షాలు పొందాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరుతున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు గ్రామంలో ఐక్యత, సోదరభావం, భక్తి భావాలను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


