ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వైయస్సార్ కడప జిల్లాలో నీట్ (యూజీ)-2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..!

వైయస్సార్ కడప జిల్లాలో నీట్ (యూజీ)-2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..!

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లాలో 10 కేంద్రాల్లో హాజరుకానున్న 3,148 మంది అభ్యర్థులు

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కడప, జూన్ 16: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో “నీట్” పరీక్ష నిర్వహణపై.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డిఆర్వో మల్లికార్జునుడు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 3,148 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో కడప పట్టణ పరిధిలో 2,386 మంది, ప్రొద్దుటూరు పరిధిలో 762 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారని.. కడపలో 8 కేంద్రాలు, ప్రొద్దుటూరులో 2 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కడపలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 418 మంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో 408 మంది, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 360 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వైఆర్‌జెడ్‌పీహెచ్ బాలికల పాఠశాల, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ పురుషుల కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 240 మంది చొప్పున పరీక్షకు హాజరుకానున్నారన్నారు. అలాగే ప్రొద్దుటూరులోని యోగి వేమన విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అత్యధికంగా 528 మంది, ఏబీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 234 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 264 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల ప్రవేశం, బయోమెట్రిక్ ధృవీకరణ, భద్రతా తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, జామర్లు, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్లు, వైద్య సదుపాయాలు, అంబులెన్స్ సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని, నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక గదులు, స్క్రైబ్ సౌకర్యం, అదనపు సమయం వంటి ఏర్పాట్లు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. పరీక్ష ముగిసిన అనంతరం ఓఎంఆర్ షీట్ల సీలింగ్, భద్రపరిచే ప్రక్రియ, పోస్టల్ డిస్పాచ్, గోప్య పరీక్షా సామగ్రి రవాణా తదితర అంశాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష కావడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి పరీక్షను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకుని అవసరమైన ధ్రువపత్రాలతో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… నీట్ (యూజీ)-2026 పరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో తల్లిదండ్రులు, బంధువులు గుమికూడకుండా సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, అభ్యర్థులు ముందుగానే ప్రయాణం ప్రారంభించాలని సూచించారు. పరీక్షా సామగ్రి రవాణా, భద్రత, కేంద్రాల పర్యవేక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, పరీక్ష నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కడప, ప్రొద్దుటూరు సిటీ కో ఆర్డినేటర్స్ మునీష్ మీనా, జయచంద్రా రెడ్డి, పోలీసు, రెవెన్యూ, ఏపీఎస్పీడిసిఎల్, మెడికల్, లేబర్, డిసేబుల్, పోస్టల్ తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!