ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు
పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 13: ఆదివాసుల హక్కులకు, చట్టబద్ధంగా కల్పించిన రక్షణలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు హెచ్చరించారు. 1/70 చట్టం పరిరక్షణ కోసం ఆదివాసులంతా ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 30న దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం దమ్మపేట మండల కేంద్రం నుంచి ప్రచారం చేపట్టి, వివిధ గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల భూములకు రక్షణ కల్పించాలని, గిరిజనేతరుల భూములపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న గిరిజనేతరుల అంశంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట వారిని మైదాన ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని కోరారు.
ఆదివాసుల భూములు, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఆదివాసీ సమాజం ఐక్యంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. నవంబర్ 30న నిర్వహించనున్న తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి ఆదివాసులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ దమ్మపేట మండల అధ్యక్షుడు సోయం మోహన్ దొరతో పాటు నాయకులు గడ్డం వెంకటేశ్వరరావు, బండారు సూర్యనారాయణ, పదం విజయలక్ష్మి, కారం బాబురావు, కాకా శివశంకర్ ప్రసాద్, కారం బోడయ్య, కొర్సా వెంకటేష్, వగ్గెల బాబు, వాసం వెంకటేశ్వరరావు, కారం నాగేంద్రబాబు, కీసరి వెంకటస్వామి, తోలెం శ్రీను, కొర్సా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


