అసలు డబ్బు ఎందుకు సరిపోవడం లేదు మనిషి కి..?
(జూన్ 14: ఆదివారం) పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్.
పేదవాడికి కూడా సరిపోవడం లేదు. ధనవంతుడికి కూడా సరిపోవడం లేదు. మనిషి సంపాదన కంటే.మనిషి ఆశలు ఎక్కువగా పరిగెడుతున్నాయి. ఈ రోజుల్లో కూలి పని చేసుకునే వారికి కూలి సరిపోవడం లేదు.ఉద్యోగం చేసే వారికి జీతం సరిపోవడం లేదు. వ్యాపారం చేసే వారికి లాభం సరిపోవడం లేదు.వ్యవసాయం చేసే రైతుకి పంట వచ్చినా సరిపోవడం లేదు. పేదవాడు “డబ్బు సరిపోవడం లేదు” అంటున్నాడు.మధ్యతరగతి వాడు “ఇంకా కావాలి” అంటున్నాడు.ధనవంతుడు కూడా “ఇది చాలదు” అంటున్నాడు.
అంటే సమస్య డబ్బులోనా?లేక మనిషి ఆలోచనలోనా?
మనిషి జీవితం ఎప్పుడూ ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉండదు.అతని మనసు ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఉంటుంది. శరీరం ఈరోజులో ఉంటుంది.మనసు రేపటిలో ఉంటుంది.అందుకే వచ్చిన ఆదాయం సరిపోవడం లేదు.
వంద రూపాయలు ఉన్నవాడురెండు వందల అవసరాలు ఊహిస్తున్నాడు.వెయ్యి రూపాయలు ఉన్నవాడు రెండు వేల ఖర్చులు మొదలు పెడుతున్నాడు. లక్ష రూపాయలు వచ్చినవాడు
రెండు లక్షల పనులు మొదలుపెడుతున్నాడు. పది లక్షలు వచ్చినవాడు ఇరవై లక్షల కలలు కంటున్నాడు. కోటి రూపాయలు వచ్చినవాడు
రెండు కోట్ల వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాడు.
వంద కోట్లు ఉన్నవాడు కూడా ఇంకా రెండువందల కోట్లు ఎలా సంపాదించాలి అని పరుగెడుతున్నాడు. ఇది కేవలం డబ్బు సమస్య కాదు. ఇది ఆశ అనే మనసు స్వభావం. మనిషికి అవసరాలు ఉంటాయి.ఆ అవసరాలు సహజమైనవి.ఆహారం కావాలి.బట్టలు కావాలి.
ఇల్లు కావాలి.పిల్లల చదువు కావాలి.ఆరోగ్యం కావాలి…..ఇవి అవసరాలు.
అవసరం దాటితే ఆశ మొదలవుతుంది. ఒక ఇల్లు ఉంటే ఇంకో పెద్ద ఇల్లు కావాలి.ఒక బైక్ ఉంటే కారు కావాలి.ఒక కారు ఉంటే ఖరీదైన కారు కావాలి.చిన్న ఫోన్ ఉంటే పెద్ద ఫోన్ కావాలి.
జీవితం సౌకర్యం కోసం మొదలైన ప్రయాణం
చివరకు పోలికల కోసం మారిపోతుంది. మనిషి తన జీవితం చూసుకుని బాధపడటం కంటేఇతరుల జీవితం చూసుకుని ఎక్కువ బాధపడుతున్నాడు.పక్కింటి వాడికి కారు వచ్చింది.మనకూ కావాలి.
స్నేహితుడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు.
మనమూ కట్టుకోవాలి.వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు.మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇలా పోలికలు పెరిగిన కొద్దీసంతృప్తి తగ్గిపోతుంది.ఇప్పటి సమాజం మనిషికి “ఉన్నది” చూపించడం లేదు.“లేనిది” మాత్రమే చూపిస్తోంది. వచ్చే ఆదాయం కన్నా మనసులోని కోరికలు వేగంగా పెరుగుతున్నాయి. డబ్బు పెరిగింది ప్రశాంతత తగ్గింది. ఒకప్పుడు తక్కువ డబ్బుతో కూడా మనుషులు ప్రశాంతంగా ఉండేవారు. ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉన్నా నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటున్నారు. ఎందుకంటే డబ్బు పెరిగింది కానీ మనసుకు శాంతి తగ్గింది.డబ్బు జీవితం నడపడానికి అవసరం.కానీ డబ్బే జీవితం కాదు. మనిషి సంపాదన పెరుగుతున్న కొద్దీ
బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి.బాధ్యతలు పెరిగిన కొద్దీ భయం పెరుగుతోంది. ఇది పోతే?….రేపు ఏమవుతుంది?…ఇంకా ఎలా సంపాదించాలి?.అనే ఆలోచనలు మనిషిని ఎప్పుడూ పరుగెత్తిస్తున్నాయి.
భవిష్యత్తు కోసం జీవితం మరిచిపోవడం
మనిషి భవిష్యత్తు కోసం పని చేయాలి.
కానీ భవిష్యత్తు కోసం వర్తమానం కోల్పోవద్దు.
చాలామంది ఇంకొంచెం సంపాదిస్తే సంతోషంగా ఉంటాను” అంటారు. కానీ ఆ “ఇంకొంచెం” అనే మాటకు ముగింపు ఉండదు.
ఒక లక్ష్యం చేరితే ఇంకో లక్ష్యం వస్తుంది.
ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతుంది.
మనసు ఎప్పుడూ “సరిపోలేదు” అనే భావంలోనే ఉంటుంది.అసలు సంపద ఏమిటి? కోట్ల రూపాయలు ఉన్నా మనశ్శాంతి లేకపోతే అతను నిజమైన ధనవంతుడు కాదు.చిన్న ఇంట్లో ఉన్నా సంతోషంగా నవ్వుకునే కుటుంబం ఉంటే అది గొప్ప సంపద.సరిపడినంతతో సంతోషపడటం కూడా ఒక కళ. ఆశ ఉండాలి.కానీ ఆశ మనిషిని బానిస చేయకూడదు.డబ్బు సంపాదించాలి. కానీ డబ్బు కోసం జీవితం కోల్పోవద్దు.భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
కానీ వర్తమానం మరిచిపోవద్దు.డబ్బు సరిపోవడం లేదని అనిపించడానికి ప్రధాన కారణం ఆదాయం తక్కువ కావడం మాత్రమే కాదు.మనసు ఎప్పుడూ ప్రస్తుతం ఉన్న స్థితి కంటే రెండు అడుగులు ముందుకు పరుగెత్తడం.

