పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 8 2026: గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి శాశ్వత గృహం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గుడిసెల్లో నివసించే అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 3.5 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని, లంచాలకు తావులేకుండా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు.
వనపర్తికి అదనపు అభివృద్ధి హామీలు
వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని మంత్రి కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.275 కోట్ల వ్యయం జరుగుతోందని, రెండో విడతలో 2,000 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం, వనపర్తిలో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ భవనం మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక, మట్టి ఉచితంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. సాదా బైనామా భూముల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు రెగ్యులరైజేషన్ కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంత్రుల వ్యాఖ్యలు
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించి గృహరహితులు లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మేఘా రెడ్డి విజ్ఞప్తులు
ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ… వనపర్తికి రెండో విడతలో 2,000 ఇళ్ల మంజూరు ఆనందదాయకమన్నారు. అదనంగా మరో 2,000 ఇళ్లు, జిల్లాలోని 32 ఎస్టీ హ్యాబిటేషన్లకు 640 ఇళ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అలాగే పెబ్బేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, వనపర్తి బైపాస్ పూర్తి, ప్రెస్ క్లబ్ భవనం, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, స్పోర్ట్స్ స్కూల్, హాకీ టర్ఫ్ వంటి అభివృద్ధి పనులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

