ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఏథర్ డీలర్ 'శ్రీకృష్ణ ఆటోమోటివ్స్' ఆగడాలు: ప్రభుత్వ నిబంధనలకు పాతర....ఆర్టీఓ పేరుతో కస్టమర్లకు నరకయాతన!**

ఏథర్ డీలర్ ‘శ్రీకృష్ణ ఆటోమోటివ్స్’ ఆగడాలు: ప్రభుత్వ నిబంధనలకు పాతర….ఆర్టీఓ పేరుతో కస్టమర్లకు నరకయాతన!**

📰 Generate e-Paper Clip

 

మల్కాజ్ గిరి ,కుషాయిగూడ : 10జూలై (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

గత మూడు నెలలుగా సికింద్రాబాద్ వాయుపురిలోని ఏథర్ ఎలక్ట్రిక్ వాహనాల డీలర్ ‘శ్రీకృష్ణ ఆటోమోటివ్స్’ కస్టమర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పర్యావరణహితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేద్దామని వస్తున్న సామాన్యులను ఈ షోరూం నిర్వాహకులు నిలువునా దోచుకుంటున్నారు. వాహనాలు విక్రయించే వరకు మాయమాటలు చెప్పి, ఆ తర్వాత తాము చేయాల్సిన పనులను కూడా వినియోగదారుల పైనే రుద్దుతూ వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
ఆర్టీఓ కార్యాలయాల్లో ఎజెంట్లను మధ్యవర్తిలా ఉంచి షోరూం ప్రతినిధులు, రిజిస్ట్రేషన్ల పేరుతో కస్టమర్ల నుంచి దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవోల ప్రకారం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వినియోగదారులు నేరుగా ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతా షోరూం స్థాయిలోనే పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ, శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ యాజమాన్యం ఈ ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తోంది.
షోరూం నిర్వాహకులు తమ సొంత తప్పులను, డాక్యుమెంటేషన్లో జరుగుతున్న జాప్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్లనే ఆర్టీఓ కార్యాలయాలకు పంపుతున్నారు. అవసరం లేకపోయినా పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పుతూ వారి సమయాన్ని వృథా చేయడమే కాకుండా, విపరీతమైన అసౌకర్యానికి గురిచేస్తున్నారు. లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసిన పాపానికి కస్టమర్లు పనులు మానుకుని షోరూం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), శాశ్వత నంబర్ ప్లేట్ల జారీలో డీలర్ చేస్తున్న ఈ తీవ్ర జాప్యం వల్ల వాహనదారులు రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసుల చేతిలో నానా ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక నంబర్లతో తిరుగుతుండటం వల్ల పోలీసులు ఆపి ప్రశ్నిస్తుంటే వినియోగదారులు సరైన సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఈ డీలర్ నిర్లక్ష్యం కారణంగా తాము జరిమానాలు కడుతూ రోడ్ల పక్కన తీవ్ర అవమానాలకు గురవుతున్నామని పలువురు కస్టమర్లు వాపోతున్నారు.ఇందులో శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ జారీ చేసిన టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీలర్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై సంబంధిత రవాణా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!