ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన

ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన

📰 Generate e-Paper Clip

 

‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయ అధికారుల సూచనలు

బిక్కవోలు, జూలై 29: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి జి. వాణి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం రంగాపురం, ఇళ్లపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో రైతులకు పంటల బీమా, ఈ-పంట నమోదు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జి. వాణి మాట్లాడుతూ, నీటి వసతి లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని, కౌలు రైతులు కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటే బీమా సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి పంట రుణాలు పొందిన రైతులు బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొన్నారు. రుణాలు లేని రైతులు సేవా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాల ద్వారా వరి పంటకు ఎకరానికి రూ.560 ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ఈ-పంట నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, రైతులందరూ తమ పంటలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని కోరారు. అలాగే స్మార్ట్‌ఫోన్ కలిగిన రైతులు వ్యవసాయ సమాచార యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భూమి వివరాలు, పంటల సలహాలు, వాతావరణ సమాచారం తదితర సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఉద్యాన శాఖ అధికారి నాగదేవి మాట్లాడుతూ, బోర్ల కింద వరి సాగుకు బదులుగా నూనె తాటి సాగు చేపట్టడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. నూనె తాటి సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పథకాల వివరాలను రైతులకు వివరించారు.

కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, గ్రామ ఉద్యాన సహాయకుడు రామకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!