పాడైన కూరగాయల సరఫరాపై ఆగ్రహం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
కంప్యూటర్ విద్యను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంలో రాజీ లేదన్న ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు. ముందుగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి చదువు, వసతి, భోజనం, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి అక్కడ వినియోగిస్తున్న వంట సామగ్రి, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాడైపోయిన కూరగాయలను సరఫరా చేసిన విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, నాసిరకం, పాడైన కూరగాయలను సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత బిల్లుల చెల్లింపును తక్షణమే నిలిపివేసి పూర్తి విచారణ నిర్వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల ఆధునిక విద్య కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే, వాటిని వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ విద్య ప్రతి విద్యార్థికి అందేలా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వృథా కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల హాజరు రికార్డును పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకునేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో నాణ్యమైన విద్య, డిజిటల్ సౌకర్యాలు, మెరుగైన వసతి, పోషకాహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో పొందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, సర్పంచ్ మద్దిలేటి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

