పీహెచ్‌సీలో ఏడాదిగా పనిచేయని యంత్రంపై ఆగ్రహం..
గురుకులంలో నిర్లక్ష్యంపై షోకాజ్ నోటీసులు..
పొలిటికల్ పవర్,దమ్మపేట, ఆగస్టు 20: దమ్మపేట మండలంలో అభివృద్ధి పనులు, వైద్య సేవలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్వారిగూడెం పీహెచ్‌సీ, గండుగులపల్లి మోడల్ సోలార్ గ్రామం, మదలపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను పరిశీలించారు.పట్వారిగూడెం పీహెచ్‌సీలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగుల వివరాలను పరిశీలించిన కలెక్టర్.. రక్త పరీక్షల అనాలసిస్ యంత్రం ఏడాదిగా పనిచేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన పరికరం ఇంతకాలం పనిచేయకపోయినా మరమ్మతులకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. “మీ ఇంట్లో పరికరం పనిచేయకపోతే ఇలాగే వదిలేస్తారా?” అంటూ ప్రశ్నించిన ఆయన, జిల్లాలో పనిచేయని వైద్య పరికరాలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.అనంతరం గండుగులపల్లిలో జరుగుతున్న మోడల్ సోలార్ గ్రామం పనులను పరిశీలించారు. గ్రామంలోని 424 గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయనుండగా, ఇప్పటికే 242 ఇళ్లలో పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్లలోనూ పనులను వేగవంతం చేసి గ్రామాన్ని ఆదర్శ మోడల్ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. మందలపల్లి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.. డిజిటల్ క్లాస్‌రూమ్, పరిసరాలు, కిచెన్, డైనింగ్ హాల్‌లో అపరిశుభ్రతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందకపోవడంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, మెనూ అమలులో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, నాణ్యమైన విద్య విషయంలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. తనిఖీల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్, దమ్మపేట తహసీల్దార్ మురళి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
