ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యంపై బీఆర్‌ఎస్ సమరభేరి

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యంపై బీఆర్‌ఎస్ సమరభేరి

📰 Generate e-Paper Clip

6 గ్యారంటీలు.. 420 హామీల అమలుకు 8 రోజుల పాటు వినూత్న నిరసనలు

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02 2026: నపర్తి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడి, రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, 11 డిక్లరేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 8 రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు నిరసన కార్యక్రమాలపై నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ మొద్దు నిద్రను తట్టిలేపేలా ఉద్యమాలు చేపట్టాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

హామీల అమలుపై బీఆర్‌ఎస్ పోరుబాట

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రావాల్సిన రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు బోనస్, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, ఆటో కార్మికులకు ఆర్థిక సాయం, మహిళలకు ఆర్థిక సహాయం తదితర పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అలాగే వృద్ధులు, బీడీ కార్మికులు, దివ్యాంగులకు ఆర్థిక సహాయం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లో తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఆయన అన్నారు.

ఓటర్ జాబితా సవరణపై సమీక్ష

సమావేశంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం (SIR) పై కూడా నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏలు, నాయకులు ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో క్రియాశీలకంగా పనిచేశారని అభినందించారు. కేవలం లక్ష్యం పూర్తయిందనే భావనతో నిర్లక్ష్యం వహించకుండా, ఓటర్లకు వచ్చిన నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నోటీసులు అందుకున్న ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తూ, వాటి పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

నాయకులు, కార్యకర్తల హాజరు

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బి. లక్ష్మయ్య, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, కౌన్సిలర్ మురళీ సాగర్, మండల పార్టీ అధ్యక్షులు కె. మాణిక్యం, గంధం పరంజ్యోతి, రాళ్ల కృష్ణయ్య, వనం రాములు, దిలీప్ రెడ్డి, అల్వాల వెంకట్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, సర్పంచులు శోభా, తిరుపతయ్య, శేఖర్, నాగమ్మ, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!