
**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
*గురుకులాల విలీనంపై సమగ్ర విచారణ జరపాలి*
తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలల విలీనంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, గౌరవం, వసతి సౌకర్యాల విషయంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు.
గురుకుల పాఠశాలలను విలీనంతో అక్కడ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని కోట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 500 మంది, విశాఖపట్నం గురుకులంలో 500 మంది, గుంటూరు తాడికొండ గురుకులంలో 500 మంది, విశాఖపట్నం జిల్లాలోని మారికవలస ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 480 మంది, విద్యార్థులు ఉన్నట్లు లేఖలో వివరించారు. ఈ నాలుగు గురుకులాలో సుమారు 1,980 మంది విద్యార్థులు ఉన్నారని ఈ లేఖలో పేర్కొన్నారు.
గురుకులాల విలీనం కారణంగా విద్యార్థులకు సరిపడా వసతి సౌకర్యాలు లేక విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఉంచుతున్నారని, మరికొన్ని సందర్భాల్లో విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా సరిగా లేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రత, గౌరవం, విద్యా వాతావరణంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
*గురుకుల పాఠశాలల విలీనంపై సమగ్ర విచారణ జరపాలి*
గురుకులాలను విలీనం చేసే ముందు అక్కడి వసతి సామర్థ్యం, విద్యార్థుల సంఖ్య, అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా అనే విషయాలను పరిశీలించాలని ఎంపీ కోరారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, మానవ హక్కుల కమిషన్ వెంటనే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సంఖ్య, వసతి సామర్థ్యం, గదుల్లో ఎంతమంది ఉంటున్నారు, నిద్రించే సౌకర్యాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, వైద్య సదుపాయాలు, గాలి ప్రసరణ వంటి అంశాలను పరిశీలించాలని కోరారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, వసతి గృహ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని కూడా ఎంపీ కోరారు. గురుకుల పాఠశాలలు పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి కల్పించే ముఖ్యమైన విద్యా సంస్థలని, వాటి నిర్వహణలో విద్యార్థుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.

