
*రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్*
*ఏఐవైఎఫ్ కడప జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ ధ్వజం*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించడానికి ఖజానాలో నిధులు లేవని చేతులెత్తేస్తున్న కూటమి ప్రభుత్వం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను మేపడానికి, పార్టీ ప్రచారానికి మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఎలా ఖర్చు చేస్తోందని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిరుద్యోగుల ఆకలి కేకలు పట్టవు కానీ, సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తారా చంద్రబాబు ?” అంటూ ఘాటుగా నిలదీశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిరుద్యోగ, యువజన వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
*యువత ఓట్లతో గద్దెనెక్కి*… *ఇప్పుడు వెన్నుపోటా*?
ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని ‘సూపర్ సిక్స్’ పేరుతో ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి రాగానే ఆ హామీలను అటకెక్కించారని మండిపడ్డారు. యువత చదువులు పూర్తి చేసుకుని ఉపాధి లేక తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తుంటే, వారికి నెలకు రూ. 3,000 ఇవ్వడానికి బడ్జెట్ సాకులు చెబుతున్న ప్రభుత్వం.. తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి, రీల్స్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ. లక్షలు, కోట్లు గుమ్మరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజల పన్నుల రూపంలో సమకూరిన ప్రజాధనాన్ని నిరుద్యోగుల సంక్షేమానికి వాడాల్సింది పోయి, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు, పీఆర్ ఏజెన్సీలకు కట్టబెట్టడం తీవ్రమైన విశ్వాసఘాతుకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ, గ్రూప్స్, పోలీస్ రిక్రూట్‌మెంట్ల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ అప్పులపాలవుతున్న యువత జీవితాలతో ఆటలాడటం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు.
*భృతి ఇచ్చేదాకా పోరాటం ఆగదు*!…
చంద్రబాబు నాయుడు పాలనలో నిజమైన యువత సమస్యలు విస్మరణకు గురవుతున్నాయని, కేవలం సోషల్ మీడియా గ్రాఫిక్స్, ప్రచార ఆర్భాటాలతోనే పరిపాలన నెట్టుకొస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అర్హులైన ప్రతి నిరుద్యోగికి తక్షణమే రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతిని విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేలా సమగ్ర జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే ప్రకటించాలని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టే అనాలోచిత విధానాలకు తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువతను, విద్యార్థులను ఏకం చేసి సచివాలయాన్ని, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన యువత ఆగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అయన స్పష్టం చేశారు.
*ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ విధులు గాలికి*..
ఎన్నికల సంఘం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పవిత్ర సంస్థ అని, కానీ ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఆ నైతికతను పూర్తిగా కాలరాశారని మండిపడ్డారు.స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీఈసీ కార్యాలయం కేంద్ర క్యాబినెట్ ఆదేశాలను అమలు చేసే ఒక శాఖలా దిగజారిపోయిందని, రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని జ్ఞానేశ్ కుమార్ పూర్తిగా తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరిపై ఉందని అయన గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లితే అది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని ప్రభాకర్ హెచ్చరించారు.

