ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులతో సమన్వయం..
దమ్మపేట, పొలిటికల్ పవర్, అక్టోబర్ 27: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పార్కలగండి గ్రామపంచాయతీ సర్పంచ్ కొమరం సుశీల చొరవ చూపుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పార్టీ నాయకులను కలిసి పట్టభద్రుల ఓటరు నమోదు, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.
దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెంలోని మెచ్చా నాగేశ్వరరావు నివాసంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి ఉప్పల వెంకట రమణ ఆధ్వర్యంలో ఐదు మండలాల పార్టీ నాయకులతో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సర్పంచ్ కొమరం సుశీల నాయకులతో కలిసి ఓటరు నమోదు ప్రక్రియను గ్రామస్థాయిలో విస్తృతంగా చేపట్టే అంశంపై చర్చించారు.

ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని సమావేశంలో సూచించారు. గ్రామగ్రామాన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సమావేశంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, విధానాలపై ప్రజల్లో చర్చ జరిపి, పార్టీ తరఫున తమ వాదనలను ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు.
పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల మాట్లాడుతూ, అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా తమ హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, గ్రామస్థాయిలో అవగాహన పెంచేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. ఆమె వెంట యువ నాయకులు కాక శివ శంకర్ వరప్రసాద్, సున్నం నరేంద్ర పాల్గొన్నారు.


