ePaper
Friday, June 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆరు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – సీరియల్ నిందితుడు అరెస్ట్* - 58.09 లక్షల...

ఆరు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – సీరియల్ నిందితుడు అరెస్ట్* – 58.09 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 04:

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: తాళంవేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సీరియల్ నిందితుడిని అనపర్తి పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.58.09 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి, రావులపాలెం, కోరుకొండ, ఆలమూరు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఆరు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం గొంటువానిపాలెం గ్రామానికి చెందిన చిలపనశెట్టి సన్యాసిరావు (31) జూదానికి బానిసగా మారి డబ్బుల కోసం దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నాడు. 2019 సంవత్సరం నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న అతడు, తాళం వేసి ఉన్న ఇళ్లను ముందుగానే గుర్తించి, యజమానులు లేని సమయంలో చోరీలు చేస్తూ వచ్చాడు.

ముద్దాయి సుమారు 45 పాత దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీటిలో సుమారు 20 కేసుల్లో కోర్టులు శిక్షలు విధించగా, ఆయా కేసుల్లో జైలుశిక్ష కూడా అనుభవించాడు. అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత తిరిగి జూదానికి అలవాటు పడి, డబ్బుల అవసరం పెరగడంతో మరలా దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల అనపర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అనపర్తి, రావులపాలెం, కోరుకొండ, ఆలమూరు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఆరు దొంగతనం కేసుల్లో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 385 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ.57,75,000గా అంచనా వేశారు. అదేవిధంగా 110 గ్రాముల వెండి వస్తువులు (విలువ రూ.29,700) మరియు రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.58,09,700గా పోలీసులు వెల్లడించారు.

జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య పర్యవేక్షణలో రాజమహేంద్రవరం క్రైమ్ డీఎస్పీ ఏ. సుబాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. రాజమహేంద్రవరం క్రైమ్ సీసీఎస్ సీఐ వై. రాంబాబు, సీఐ బాలశౌరి, సీసీఎస్ ఎస్సై ఏ. ఆనందరెడ్డి, అనపర్తి ఎస్సై ఎల్. శ్రీను నాయక్ మరియు సీసీఎస్ సిబ్బంది సంయుక్తంగా పనిచేసి కేసును విజయవంతంగా ఛేదించారు.

కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!