సీఎంఓఏఐ రిలే నిరాహార దీక్షలకు బీసీ ఓబీసీ అసోసియేషన్ మద్దతు
అధికారుల న్యాయబద్ధమైన హక్కులు పరిష్కరించే వరకు అండగా ఉంటామని స్పష్టం
పొలిటికల్ పవర్ దినపత్రిక / పి యన్ 9 టి వి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో సింగరేణి సంస్థ అధికారులకు రావాల్సిన పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఆర్పీ) బకాయిలతో పాటు ఇతర న్యాయబద్ధమైన హక్కులను తక్షణమే పరిష్కరించాలని బీసీ ఓబీసీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
సింగరేణి అధికారుల సంఘం (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం సత్తుపల్లి బీసీ ఓబీసీ అసోసియేషన్ తరఫున సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి, దీక్షలో పాల్గొంటున్న అధికారులకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు.
సింగరేణి అధికారులకు న్యాయబద్ధంగా చెల్లించాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లింపులో జాప్యం చేయడం ద్వారా సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న అధికారుల సేవలను గుర్తించకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తోందని వారు అన్నారు.
2007లో పీఆర్పీ ఒప్పందం కుదిరినప్పటి నుంచి కోల్ ఇండియాలో ప్రతి ఏడాది పీఆర్పీ చెల్లిస్తున్నప్పటికీ, సింగరేణి అధికారులకు మాత్రం యాజమాన్యం చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సింగరేణి సంస్థకు అధికారులు, కార్మికులు రెండు నేత్రాల వంటివారని, ఇరువర్గాలు సమన్వయంతో పనిచేస్తేనే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సింగరేణి అధికారుల న్యాయమైన హక్కులకు భంగం కలిగించే చర్యలు కొనసాగితే వారి పోరాటానికి బీసీ ఓబీసీ అసోసియేషన్ అండగా ఉంటుందని తెలిపారు.
సింగరేణి యాజమాన్యం వెంటనే అధికారుల పీఆర్పీ బకాయిలతో పాటు ఇతర న్యాయబద్ధమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి బీసీ ఓబీసీ అసోసియేషన్ నాయకులు తీగల క్రాంతి కుమార్, పోగుల నాగేశ్వరరావు, నరేందర్, కాజా మొయినుద్దీన్, బాజీ పాషా, సంపత్, మంగళగిరి శ్రీనివాస్, బాలాజీ, షణ్ముఖాచారి, సురేష్, గోపి, యాకూబ్, అఫ్రోజ్, రషీద్, రత్నకుమార్, రాహుల్, మురళీకృష్ణ చారి, రాంబాబు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
