ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎల్‌నినో పరిస్థితుల్లో వరి రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో వరి రైతులు అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

 

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు

బిక్కవోలు, ఆగస్టు 4: బిక్కవోలు మండలంలోని ఊలపల్లి, బిక్కవోలు గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి (ఏఓ) జి. వాణి, ఏఈఓలు శ్రీనివాసు, భాస్కరరెడ్డి, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏఓ జి. వాణి మాట్లాడుతూ ఈ-క్రాపింగ్, పంటల బీమా ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పించారు. పంటల బీమా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ చివరి గడువని, రైతులు బ్యాంకులు లేదా సీఎస్‌సీ కేంద్రాల్లో ఎకరానికి రూ.570 చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు.

జిల్లాలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అడపాదడపా వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పంటలో చీడపీడలు, తెగుళ్లు ఎక్కువయ్యే అవకాశముందని తెలిపారు. దీంతో రైతులు ముందస్తుగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆకునల్లి ఉధృతి వల్ల ఆకులు ఎర్రబడితే డైకాఫోల్ 5 మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఎండాకు తెగులు సోకిన పొలాల్లో పాత నీటిని తొలగించి, కొంతకాలం ఆరబెట్టి తిరిగి నీరు పెట్టాలని, నత్రజని ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, ఎకరానికి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలని తెలిపారు. తెగులు తీవ్రంగా ఉంటే ప్లాంటోమైసిన్ 1 గ్రాము, కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

గడ్డి దుబ్బు లేదా కాండం కుళ్లు తెగులు కనిపిస్తే టెబ్యూకోనజోల్ 2 మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వివరించారు.

ఎలుకల నివారణకు పొలాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గట్లను శుభ్రం చేయాలని, ఎలుక బుట్టలు ఏర్పాటు చేయాలని, బొరియల్లో పొగబారించాలని సూచించారు. అలాగే బ్రోమాడియోలోన్ 2 శాతం ఎర మందును నూకలు, నూనెతో కలిపి చిన్న పొట్లాలుగా తయారు చేసి ఎలుక బొరియల వద్ద ఉంచాలని, ఈ చర్యలను రైతులందరూ సామూహికంగా చేపట్టాలని కోరారు.

మొవ్వు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరంట్రనిలిప్రోల్ 0.3 గ్రాములు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!