కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి – మాజీ మంత్రి హరీష్ రావు
రైతులకు న్యాయం చేయాలని డిమాండ్.. బీఆర్ఎస్లో భారీగా చేరికలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 02 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నల రణబేరి సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులు భారీగా హాజరయ్యారు.
హరీష్ రావు తీవ్ర విమర్శలు
సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. పెద్దమందడి మండలానికి చెందిన కొండయ్య అనే రైతు మూడు ఎకరాల్లో సాగు చేసిన పంట పూర్తిగా ఎండిపోయిందని పేర్కొన్నారు. కృష్ణా జలాలు అందాల్సిన పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోవడం బాధాకరమన్నారు. మన పంట పొలాలకు రావాల్సిన కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని ఆరోపించారు. కుప్పం వరకు వందల కిలోమీటర్ల దూరం నీళ్లు వెళ్తున్నా పాలమూరు రైతులకు మాత్రం సాగునీరు అందడం లేదని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఐదు పంపులు నడిపితే రోజుకు 0.3456 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని, తద్వారా రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉందని హరీష్ రావు వివరించారు. మోటార్లను పూర్తిస్థాయిలో నడపకుండా తొమ్మిది గంటలకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటలకు సాగునీరు, విద్యుత్ అందించామని, ప్రస్తుతం కరెంట్, నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూడేళ్ల పాలనలో చెక్‌డ్యామ్‌లు, పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వానాకాలంలోనే లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, యాసంగిలో సాగునీరు, విద్యుత్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరువు మండలాల ప్రకటనతో సరిపెట్టకుండా పంట నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారో స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కృష్ణా నదిలో నీళ్లు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలు తరలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని అన్నారు. ఒకప్పుడు వనపర్తి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పంట సాగయ్యేదని, ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనిపించేవని గుర్తుచేశారు. ప్రస్తుతం పంటలు ఎండిపోతుంటే బాధ కలుగుతోందన్నారు. ప్రతి సీజన్లో యూరియా కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉందని, ప్రజలు మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీకి కప్పం కడుతున్న సీఎం: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 82 సార్లు ఢిల్లీకి వెళ్లారని, రాష్ట్ర ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ప్రభుత్వం దర్యాప్తు విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
రైతన్నల రణబేరి సభ సందర్భంగా పలువురు నాయకులు, వారి అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎదుల గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెల శ్రీనివాస్ రెడ్డి తనతో పాటు సుమారు 200 మంది అనుచరులతో పార్టీలో చేరారు. దత్తాయపల్లి సర్పంచ్ దేవేందర్ నాయుడు, మాజీ సర్పంచ్ రాజు నాయక్ మరో 150 మంది అనుచరులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో, హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు వినోద్ గౌడ్ కూడా తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.
ఎండిన చేపలను చూపించిన ముదిరాజ్ నాయకులు

కేఎల్ఐ ద్వారా వనపర్తి ప్రాంతంలోని చెరువులను నింపకపోవడంతో చేపల పెంపకం దెబ్బతిన్నదని పేర్కొంటూ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యదర్శి వాకిటి శ్రీధర్, నాయకులు నందిమల్ల అశోక్, నాగేంద్రం, శ్రీను, రమేష్ గౌడ్ తదితరులు హరీష్ రావుకు చేపల పరిస్థితిని వివరించారు. చెరువుల్లో నీరు లేక చేపల పెరుగుదల నిలిచిపోయిందని, మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, గద్వాల బీఆర్ఎస్ ఇన్చార్జి బాస్ హనుమంతు నాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్, వాల్య నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, రజినీ సాయిచంద్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దమందడి మాజీ రైతుబంధు అధ్యక్షుడు పి జగదీశ్వర్ రెడ్డి, పెద్దమందడి మాజీ జెడ్పిటిసి కే రఘుపతి రెడ్డి, ఖిల్లా ఘనపూర్ మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, అల్వాల సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి, అల్వల వెంకట్ రెడ్డి, బాల్ రెడ్డి, ఖిల్లా ఘనపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, పెద్దమందడి మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేణు యాదవ్, చిన్నమందడి నాగేంద్రం, దొడగుంటపల్లి జానకిరామ్ రెడ్డి, వెల్టూరు గ్రామ సర్పంచ్ అశోక్, మణిగిల్ల సర్పంచు పలుస శ్రీనివాస్ గౌడ్, పెద్దమందడి గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సేనాపతి, చిలకటోని పల్లి గ్రామ సర్పంచ్ అశ్విత రమేష్, అమ్మపల్లి రామేశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు వెల్టూరు చిత్తూరు కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, గొంది రఘువర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, సాంబ యాదయ్య, మోజర్ల ఎం రాజా వర్ధన్ రెడ్డి, గట్టు సతీష్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


