పెద్దమందడి మండల తహసీల్దార్ మల్లికార్జున్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ల వివరాల ధ్రువీకరణ, తప్పుల సవరణకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు పెద్దమందడి మండల తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. SIR ధ్రువీకరణ ప్రక్రియలో ఓటర్ల పుట్టిన తేదీ ఆధారంగా వివిధ రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తహసిల్దార్ తెలిపారు. 01-07-1987కి ముందు జన్మించిన వారు తమకు సంబంధించిన ఒక పత్రాన్ని, 01-07-1987 నుంచి 02-12-2004 మధ్య జన్మించిన వారు తమ పత్రంతో పాటు తండ్రి లేదా తల్లి పత్రాన్ని, 02-12-2004 తర్వాత జన్మించిన వారు తమతో పాటు తండ్రి, తల్లి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా విదేశీయులైతే వారి పాస్‌పోర్ట్, వీసా పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అంగీకరించే పత్రాలు
జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్, గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన 10వ తరగతి/విద్యా అర్హత సర్టిఫికెట్, ప్రభుత్వ/ప్రభుత్వ రంగ సంస్థ/పింఛనుదారుల గుర్తింపు కార్డు, 01-07-1987కు ముందు ప్రభుత్వం, బ్యాంకు, ఎల్‌ఐసీ లేదా పోస్టాఫీసు రికార్డులు, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కుల ధృవీకరణ పత్రం, ప్రభుత్వ భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం, ప్రభుత్వ కుటుంబ రిజిస్టర్ లేదా ఎన్‌ఆర్‌సీ కాపీ, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం తదితర పత్రాలను నిబంధనల ప్రకారం సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డును కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొన్నారు.
గ్రామసభల్లో అవగాహన
SIR ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ నెల 27న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. సర్పంచ్‌లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో బీఎల్‌వోలు SIR ప్రక్రియ, ఓటర్ల వివరాల పరిశీలన, పత్రాల సమర్పణ తదితర అంశాలను ప్రజలకు వివరిస్తారని చెప్పారు. SIR లో భాగంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. నోటీసు అందుకున్న వారు ఏడు రోజులలోపు తమ గుర్తింపు, ధ్రువీకరణకు సంబంధించిన అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు తదితర అంశాలను పరిశీలించుకుని ఏవైనా తప్పులు ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని సరిదిద్దుకోవాలని తహసీల్దార్ మల్లికార్జున్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు ప్రజలు బీఎల్‌వోలకు సహకరించాలని కోరారు.

