ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeతెలంగాణభద్రాద్రిఏజెన్సీ విద్యపై ఐటీడీఏ నిర్లక్ష్యం

ఏజెన్సీ విద్యపై ఐటీడీఏ నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయుల కొరతతో ఆదివాసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం: పాయం సత్యనారాయణ

పొలిటికల్ పవర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఆగస్టు 29: ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆరోపించారు. ఆదివాసీ విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఐటీడీఏ ఏర్పాటు చేశారని తెలిపారు. 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఐటీడీఏ ఏర్పాటు కాగా, అనంతరం పాల్వంచలో కొనసాగిందని, 1993 నుంచి భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ పరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఆదివాసీ గ్రామాలు, ప్రజలు సాధించిన అభివృద్ధిపై సమగ్ర గణాంకాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని పాయం సత్యనారాయణ అన్నారు. ఉన్న ఉపాధ్యాయులను సైతం డిప్యూటేషన్ పేరుతో మైదాన ప్రాంతాలకు పంపించడం వల్ల ఆదివాసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. చర్ల మండలం కుర్నపల్లి పంచాయతీలోని మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపించడంతో విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయని, ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇటీవల అశ్వారావుపేట ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించిన సమయంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు కనీసం అక్షరాలు రాయలేని పరిస్థితిని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితులు ఏజెన్సీలోని మరికొన్ని పాఠశాలల్లోనూ ఉన్నాయని అన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, విద్యార్థులకు సక్రమంగా బోధన అందకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఆరోపించారు.

ముఖ్యంగా ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి కీలక సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని పాయం సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నీ ఐటీడీఏ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ ఆదివాసీ విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇకనైనా ప్రభుత్వం, ఐటీడీఏ ఉన్నతాధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలను సమగ్రంగా తనిఖీ చేసి, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు డిప్యూటేషన్లను రద్దు చేసి స్థానిక పాఠశాలల్లోనే ఉపాధ్యాయులను కొనసాగించాలని పాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!