బిక్కవోలులో బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు ఎస్‌ఐఆర్ ప్రత్యేక శిక్షణ
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి:
తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బిక్కవోలు మండలంలోని బూత్ లెవల్ అధికారులు (BLOలు), సూపర్‌వైజర్లకు అనపర్తి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. అర్హత కలిగిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా మరణించినవారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా నివాసం మార్చుకున్నవారి వివరాలను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు.
ఇంటి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయడంతో పాటు, వాటిని సక్రమంగా నింపించుకుని నిర్ణీత గడువులోపు సంబంధిత అధికారులకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, సవరణల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని తెలిపారు.
ఓటరు నమోదు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో బిక్కవోలు తహసీల్దార్, ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, అనపర్తి ఎన్నికల విభాగం సీనియర్ సహాయకులు, ఇతర అధికారులు, మండలంలోని బూత్ లెవల్ అధికారులు మరియు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
