టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 18 2026: కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు, మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు అధిక సంఖ్యలో గాంధీ భవన్‌కు చేరుకుని టీపీసీసీ అధ్యక్షులను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తమకు కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, కన్నతల్లి లాంటి పార్టీ అని పేర్కొన్నారు. అలాంటి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందించే విధంగా వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయిందని చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల మనోభావాలను ఇలాంటి వ్యాఖ్యలు తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా, కార్యకర్తల మనోభావాలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య విభేదాలు సృష్టించేలా, కార్యకర్తలను నిరుత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఎమ్మెల్యే ఫిర్యాదుపై టీపీసీసీ అధ్యక్షుల సానుకూల స్పందన
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మరియు వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు చేసిన ఫిర్యాదుపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తగిన విచారణ చేపట్టి, పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ముఖ్యమంత్రిని నిందించడం, పార్టీ డబ్బులకు అమ్ముడుపోయిందని ఆరోపించడం వంటి అంశాలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో ప్రతి నాయకుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, పార్టీ నాయకత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతే పార్టీకి ప్రధాన బలమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పార్టీ అధిష్టానం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం తమకు ఉందని వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మండలాలు, పట్టణాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డు పాలకవర్గం, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


