……………. అప్పటి ఎమ్మార్వో సుదీర్,…ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై విచారణ పూర్తి..తక్షణమే ఉద్యోగాల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సిపిఎం… మండల కార్యదర్శి ఎంబడి. పోలయ్య గర్జన.
కాశినాయన సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్ పిన్ 9 టివి సమగ్ర జాతీయ దినపత్రిక. రిపోర్టర్. ఎం. ప్రసాదరావు కలసపాడు. వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కాశినాయన మండలంలో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల అండదండలతో సాగిన భూ అక్రమాల పర్వం ఇప్పుడు మండలంలో దావానలంలా వ్యాపిస్తోంది. నాడు అధికార గర్వంతో, చట్టాలను తుంగలో తొక్కి, పేద రైతుల భూములను మాయం చేస్తూ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను అక్రమార్కులకు కట్టబెట్టిన నాటి అధికారుల లీలలు రోజురోజుకూ వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి తహశీల్దార్ (ఎమ్మార్వో) సుదీర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ ఐ) సిద్ధేశ్వరయ్య, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (విఆర్ఓ) వేణుగోపాల్‌ల నేతృత్వంలో జరిగిన ఈ భారీ భూదందాపై సమగ్ర విచారణ జరిపి, వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎంబడి పోలయ్య తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.
రికార్డుల మాయాజాలం: ఆరు ఎకరాల భూమి.. 43 ఎకరాలుగా రూపాంతరం!
ఈ భూ కుంభకోణానికి సంబంధించిన సంచలన నిజాలను ఎంబడి పోలయ్య ఆధారాలతో సహా మీడియా ముందుంచారు. మండల పరిధిలోని నాయనపల్లె, ఇటుకలపాడు, అంబవరం, అక్కింగుండ్లు గ్రామాల్లోని వివిధ సర్వే నంబర్లలో రెవెన్యూ రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా నాయనపల్లె గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 131, అలాగే 1200, 1100 నంబర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు.
సాధారణంగా క్షేత్రస్థాయిలో (ఆన్ గ్రౌండ్) నాయనపల్లె సర్వే నంబర్ 131 లో కచ్చితంగా కేవలం 6 ఎకరాల 58 సెంట్ల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, నాటి రెవెన్యూ అధికారులు తమ కలం బలాన్ని, కంప్యూటర్ కీబోర్డులను ఉపయోగించి ఆరు ఎకరాల చిల్లర ఉన్న భూమిని ఏకంగా 43 ఎకరాల 40 సెంట్లుగా వెబ్‌ల్యాండ్ (ఆన్‌లైన్) రికార్డుల్లో చూపిస్తూ మాయాజాలం సృష్టించారు. లేని భూమిని ఉన్నట్లుగా రికార్డుల్లో పెంచి, కాగితాలపై సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టించారని పోలయ్య ధ్వజమెత్తారు.
కోట్ల రూపాయల చేతులు మార్పిడి.. 17 మందికి అక్రమ ఆన్‌లైన్:
కేవలం రికార్డుల్లో భూమి విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా, ఆ అదనపు భూమిని ఏకంగా 17 మంది వ్యక్తుల పేరిట అక్రమంగా ఆన్‌లైన్ (వెబ్ ల్యాండ్) చేశారని పోలయ్య ఆరోపించారు. ఒకరి పేరు మీద ఉన్న భూములను, సాగు చేసుకుంటున్న అసలైన దళిత, వెనుకబడిన వర్గాల రైతులను పక్కనబెట్టి, తెరవెనుక కోట్ల రూపాయల లంచాలు తీసుకుని వేరే వాళ్ళ పేర్ల మీదకు మార్చడం వెనుక అప్పటి ఎమ్మార్వో సుదీర్, ఆర్ ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌ల పాత్ర వందకు వంద శాతం ఉందని ఆయన స్పష్టం చేశారు. నాడు వీరు చేసిన దందాలు, అక్రమాలు ఇప్పుడు రోజురోజుకూ వెలుగులోకి వస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
ఎంక్వయిరీ జరిగింది.. తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలి:
ఈ కుంభకోణంపై ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక ఎంక్వయిరీ (విచారణ) జరిగిందని, అధికారుల అవినీతి అక్రమాలు నిజమేనని తేలిందని పోలయ్య పేర్కొన్నారు. లంచాల ఆశతో రైతులను నట్టేట ముంచిన అప్పటి ఎమ్మార్వో సుదీర్‌ను ప్రభుత్వం తక్షణమే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణను మరింత వేగవంతం చేసి, ఈ అక్రమాల్లో భాగస్వాములైన ఆర్ ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై కూడా శాఖాపరమైన కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం:
కాశినాయన మండలంలో గతంలో జరిగిన అన్ని భూ లావాదేవీలపై, వెబ్‌ల్యాండ్ రికార్డులపై ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ జరిపించాలని కోరారు. ఒకరి భూమిని మరొకరి పేరు మీదకు మార్చిన అక్రమ ఆన్‌లైన్ రికార్డులను రద్దు చేసి, అసలైన రైతులకు న్యాయం చేసేంత వరకు, అవినీతి అధికారులను శాశ్వతంగా సస్పెండ్ చేసేంత వరకు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ఎంబడి పోలయ్య హెచ్చరించారు.

