ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్!
తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.. వరద బాధితులకు సహాయక చర్యలు
దమ్మపేట, నవంబర్ 4: ప్రభుత్వ ఉద్యోగి అంటే కార్యాలయాలకే పరిమితమనే అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల కష్టాల్లో వారితో కలిసి నిలుస్తూ సేవలందిస్తున్న దమ్మపేట తహశీల్దార్ మద్దినేని మురళి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. మురసు తుపాను ప్రభావంతో మండలవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవించిన వేళ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలిచారు.
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజల పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడంలో చొరవ చూపారు. మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన నాగమణి మల్లెపూల వాగు వరద ప్రవాహంలో చిక్కుకోగా, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఆమెను సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనలో గ్రామస్థుల సమాచారం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తహసిల్దార్ మద్దినేని మురళి ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపట్టినట్లు సమాచారం. వరద బాధితుల రక్షణ, సహాయక చర్యల సమన్వయంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా అధికారులు అందుబాటులో ఉండాలనే బాధ్యతను తహశీల్దార్ మురళి తన పనితీరుతో చాటుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయ విధులకే పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్థానికులు తెలుపుతూ మద్దినేని మురళి (డిప్యూటీ కలెక్టర్ యూ/టీ, తహశీల్దార్) ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ తుపాను బాధితులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అధికారులు యువతకు ఆదర్శంగా నిలుస్తారని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నారు.
ఆపద సమయంలో ప్రజల పక్కన నిలబడి భరోసా కల్పించే అధికారుల సేవలు సమాజానికి ఎంతో అవసరం. వరదల వంటి విపత్తుల వేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న అధికారుల కృషి అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.


