సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించాలి: ఐయూఎంఎల్ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా 
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిందని, దీనికి సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ఆరోపించారు. ఖమ్మం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2025–26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యం రికార్డులు, భౌతిక నిల్వలను సమగ్రంగా పరిశీలిస్తే భారీగా ధాన్యం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. పక్కదారి పట్టిన ధాన్యం విలువ వందల కోట్ల రూపాయల్లో ఉండవచ్చని ఆరోపించారు. ప్రభుత్వ ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్‌గా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న రైస్ మిల్లులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని బాజీ బాబా విమర్శించారు. నామమాత్రంగా నోటీసులు జారీ చేసి, ఒకరిద్దరిపై మాత్రమే చర్యలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను పూర్తిస్థాయిలో రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లకు రాజకీయ, అధికారుల అండ ఉందనే ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరారు. అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారంటూ కొందరు రైస్ మిల్లర్ల యాజమాన్యాలు బహిరంగంగా చెబుతున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని బాజీ బాబా అన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల నుంచి అధికారిక వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంఆర్ ధాన్యం వ్యవహారంలో రికార్డులు, గోదాముల నిల్వలు, మిల్లుల స్టాక్, ప్రభుత్వానికి తిరిగి అందించిన ధాన్యం తదితర అంశాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలితే బాధ్యులైన మిల్లర్లతో పాటు సంబంధిత అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ ధాన్యం వ్యవహారంలో వందల కోట్ల రూపాయల అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయిని రికవరీ చేయాలని ఐయూఎంఎల్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు షేక్ బాజీ బాబా తెలిపారు.

