ప్రతి గిరిజన తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 26 2026: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధితో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డులో బుధవారం వనపర్తి జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని గిరిజన సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన యువతులు తీజ్ మొలకలతో ఎమ్మెల్యే ను సత్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… తీజ్ పండుగ బంజారా సమాజానికి ఎంతో పవిత్రమైన, ప్రత్యేకమైన పండుగ అని అన్నారు. తీజ్ సందర్భంగా గిరిజన మహిళలు, యువతులు భక్తిశ్రద్ధలతో మొలకలను పెంచి, వాటిని పూజించి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకోవడం బంజారా సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని తెలిపారు. తీజ్ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, బంజారా సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రతి తండాలో సేవాలాల్ గుడి నిర్మాణానికి కృషి
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజన సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి గిరిజన తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ స్మృతివనం ఏర్పాటుకు రూ.200 కోట్లతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గిరిజన సమాజం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. గిరిజనుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. వనపర్తిలో సేవాలాల్ మహారాజ్ విగ్రహం వనపర్తి పట్టణంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గిరిజన సేవా సంఘం సభ్యులు ఎమ్మెల్యే మేఘారెడ్డిని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, గిరిజన సమాజం ఆకాంక్షను నెరవేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనుల అభివృద్ధి, విద్య, ఉపాధి, మౌలిక వసతులతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “గిరిజనుల అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు… వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం కాపాడుతూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే నిజమైన అభివృద్ధి” అని మేఘారెడ్డి అన్నారు. వనపర్తి గడ్డపై బంజారా సంస్కృతికి ప్రతీకగా నిలిచే తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, గిరిజన సోదరసోదరీమణులతో కలిసి వారి సంప్రదాయ పూజల్లో పాల్గొనడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం నాయకులు, గిరిజన పెద్దలు, యువతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


