ePaper
Sunday, August 30, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజపాన్ విద్యా పర్యటనకు వనపర్తి వాసి మురళీకృష్ణ

జపాన్ విద్యా పర్యటనకు వనపర్తి వాసి మురళీకృష్ణ

📰 Generate e-Paper Clip

వనపర్తి జిల్లా నుంచి ఏకైక ఉపాధ్యాయుడిగా ఎంపిక.. మిత్ర బృందం ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 30 2026: పెబ్బేరు: విదేశాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విద్యా విధానాలను పరిశీలించి, వాటిని రాష్ట్ర విద్యా వ్యవస్థలో అన్వయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జపాన్ విద్యా పర్యటనకు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న పి. మురళీకృష్ణ ఎంపికయ్యారు. వనపర్తి జిల్లా నుంచి ఏకైక ఉపాధ్యాయుడిగా ఆయన ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా జపాన్ విద్యా పర్యటనకు ఎంపికైన మురళీకృష్ణను ఆయన మిత్ర బృందం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపింది. విద్యారంగంలో వినూత్నమైన బోధనా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించే అరుదైన అవకాశం లభించడంపై మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పర్యటనకు మొత్తం 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులు ఎంపికయ్యారు. ఇందులో వనపర్తి జిల్లా నుంచి పి. మురళీకృష్ణ ఒక్కరే ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం విశేషం. జపాన్ పర్యటనలో అక్కడి క్రమశిక్షణ, సాంకేతిక విద్య, జీవన నైపుణ్యాలు, సైన్స్, రోబోటిక్స్, ఆధునిక బోధనా పద్ధతులు తదితర అంశాలను మురళీకృష్ణ పరిశీలించనున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు, స్వయం క్రమశిక్షణను పెంపొందించే విధానాలను అధ్యయనం చేయనున్నారు. జపాన్‌లో పొందిన అనుభవాలు, అక్కడి విద్యా విధానాల్లోని ఉత్తమ పద్ధతులను తిరిగి వచ్చాక రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా పంచుకోవాలని మిత్రులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ… తనను జపాన్ విద్యా పర్యటనకు ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన ద్వారా పొందే జ్ఞానం, అనుభవాలను విద్యార్థుల అభ్యున్నతికి వినియోగించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మిత్ర బృందం బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్, వల్లపు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సామాజికవేత్త మేకల రమేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, లక్ష్మయ్య యాదవ్, శ్రీనాథ్, వెంకటేష్, గిరిజ గౌడు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!