ePaper
Tuesday, September 1, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలుగు రాష్ట్రాల్లో గాడి తప్పుతున్న గిరిజనాభివృద్ధి లక్ష్యం

తెలుగు రాష్ట్రాల్లో గాడి తప్పుతున్న గిరిజనాభివృద్ధి లక్ష్యం

📰 Generate e-Paper Clip

పాలకుల ఉదాసీనతకు అద్దం పడుతున్న ఐటీడీఏల వైఫల్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కులను, రక్షణలను క్షేత్రస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు రూపుదిద్దుకున్న వ్యవస్థలే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిడిఎ). కానీ, నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను పరిశీలిస్తే ఈ సంస్థలు తమ మూల సూత్రాలను, ప్రాథమిక దిశను కోల్పోయాయనే భావన స్పష్టమవుతోంది. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడంలో మరియు అత్యంత వెనుకబడిన ఆదివాసీ గూడేలకు కనీస మౌలిక సౌకర్యాలు అందించడంలో ఐటీడీఏల వ్యవస్థాగత నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

పర్యవేక్షణ లేని పాలనకు నిదర్శనం మన్ననూరు ఐటీడీఏ

ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే దానికి బలమైన పాలనా నాయకత్వం, స్పష్టమైన దార్శనికత అత్యంతావశ్యకం. అయితే నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూరు ఐటీడీఏ పరిస్థితిని గమనిస్తే ఏజెన్సీ ప్రాంతాల పట్ల పాలకవర్గానికి ఉన్న ఉదాసీనత తీవ్రంగా వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా మన్ననూరు ఐటీడీఏకు పూర్తిస్థాయి ప్రాజెక్ట్ ఆఫీసర్ నియామకం జరగకపోవడం, కేవలం ఇంఛార్జీలతో కాలం వెళ్లదీస్తూ అవసరమైన సిబ్బందిని కేటాయించకపోవడం అత్యంత విచారకరం. నామ్‌కే వాస్తే పాలన వల్ల అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న పీవీటీజీ సమూహమైన ‘చెంచు’ గిరిజనుల సంక్షేమం నామమాత్రంగా మారి, ఐటీడీఏ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐటీడీఏ కార్యాలయాలు, తహసీల్దార్ ఆఫీసులు, ఫారెస్ట్ లేదా పోలీసు స్టేషన్లకు ఏ చిన్న సమస్యతో వెళ్లినా గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చే ఆదివాసీలను అధికారులు కనీసం మనుషులుగా లెక్కచేయకపోవడం నిర్వివాదాంశం.

అవార్డుల ఆరాటం కాదు… ఆదివాసీ సంక్షేమమే పరమావధి కావాలి

మరొకవైపు భద్రాచలం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఐటీడీఏల తీరును పరిశీలిస్తే, అవి నిజమైన సంక్షేమం కంటే ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ల మీద వంద శాతం ప్రగతిని చూపించడం, పబ్లిక్ రిలేషన్స్ అవార్డులు సాధించడం, అధికారుల ప్రొఫైళ్లలో మెరిసే పురస్కారాల పట్ల చూపుతున్న శ్రద్ధ క్షేత్రస్థాయి సమస్యలపై చూపడం లేదనేది పచ్చి నిజం. కేటలాగ్‌లు, నివేదికల్లో అద్భుతమైన గణాంకాలు కనిపిస్తున్నప్పటికీ, లోతట్టు ఏజెన్సీ గూడేల్లో కనీస వైద్యం అందక డోలీ మోతలతో ప్రాణాలు వదిలే గర్భిణులు, తాగునీరు లేక కలుషిత నీటితో రోగాల బారిన పడుతున్న పసిపిల్లల నిశ్శబ్ద రోదనలు అధికారుల రికార్డుల గారడీని బట్టబయలు చేస్తున్నాయి. ప్రచార చిత్రాల్లో అవార్డులు అందుకునే అధికారులు, తీరా ఆఫీసుల గుమ్మం తొక్కిన అమాయక గిరిజనుల పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరిని చూస్తే వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో అర్థం కావడం లేదు.

మూల మూలనా విఫలమవుతున్న సేవలు

గిరిజన ప్రాంతాల్లోని విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల పరిస్థితి మరింత దిగజారింది. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందకపోవడం, ఉపాధ్యాయుల కొరత ఉండటం విద్యావ్యవస్థ బలహీనతను చూపుతోంది. సుదూర ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందక ఏటా మలేరియా, డెంగ్యూ, తీవ్ర రక్తహీనత వల్ల ప్రాణాలు పోతున్నా ఐటీడీఏల పర్యవేక్షణ శూన్యంగా మారింది. అటు పోడు భూముల హక్కుల సాధనలో గానీ, అటవీ అధికారుల దౌర్జన్యాల నుంచి గిరిజనులను కాపాడటంలో గానీ చట్టబద్ధమైన గిరిజన రక్షణ సంస్థలు గిరిజనులకు కొండంత అండగా నిలవడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు పోలీసు స్టేషన్లు, ఫారెస్ట్, రెవెన్యూ కార్యాలయాల్లో గిరిజనుల ఆర్తనాదాలను లెక్కచేసే నాథుడే కరువవ్వడం వల్ల వారి జీవనం మరింత నిరాశాజనకంగా తయారైంది.

పరిపాలనా సంస్కరణలే ఐటీడీఏల నిజమైన లక్ష్యం కావాలి

ఈ విమర్శల ఉద్దేశం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కాదు, వాటిని తిరిగి తమ మూల లక్ష్యాల వైపు మళ్లించడమే. గిరిజనుల ప్రయోజనాలు నెరవేరాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి మన్ననూరు సహా అన్ని ఖాళీగా ఉన్న ఐటీడీఏలకు నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారులను పూర్తిస్థాయి ప్రాజెక్లు అధికారులుగా నియమించాలి. అధికారుల పనితీరును కేవలం అవార్డులు లేదా నివేదికలతో కాకుండా, ఆదివాసి గూడేలలో తగ్గిన మాతృ-శిశు మరణాల రేటు మరియు మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఐటీడీఏ, రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు వ్యవస్థలు గిరిజనుల పట్ల తమ ధోరణిని మార్చుకుని, అధికారుల నిర్లక్ష్యానికి స్వస్తి చెప్పి వారి దయనీయ స్థితికి భరోసా ఇచ్చేలా వ్యవహరించాలి. మాటలకంటే చేతలకు, ఆవార్డుల కంటే ఆదివాసీల నిజమైన సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఐటీడీఏల స్థాపన యొక్క లక్ష్యం నెరవేరుతుంది.

Previous article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!