ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్.. డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు
మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం.. నిందితులకు రిమాండ్

పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గంజాయి వినియోగం, అక్రమ నిల్వపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తున్న ఆరుగురిని గుర్తించడంతో పాటు, మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్ సూచనల మేరకు దమ్మపేట పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అక్టోబర్ 31న దమ్మపేట ఎస్సై బి. రాజేష్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఆర్లపెంట గ్రామ శివారులోని స్మశాన వాటిక వద్ద గంజాయి సేవిస్తున్న ఆరుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారికి నిర్వహించిన యూరిన్ డ్రగ్ పరీక్షల్లో టిహెచ్‌సీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
విచారణలో భాగంగా లంకాలపల్లికి చెందిన పొట్ట సాయికుమార్ అలియాస్ సాయి, నాగుపల్లికి చెందిన లావుడియా చైతన్య వద్ద గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి సుమారు పావు కిలో గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.12,500 ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
అనంతరం ఎనిమిది మందిని దమ్మపేట కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు. గంజాయి కలిగి ఉన్న మరో ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. గంజాయి సరఫరా, విక్రయాల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ, వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై బి. రాజేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

