నల్లమూడిలో ప్రాచీన స్థలాలను సందర్శించిన నాయకపోడు కుల పెద్దలు..
చారిత్రక ఆనవాళ్ల పరిరక్షణకు పిలుపు

పొలిటికల్ పవర్, ములకలపల్లి,అక్టోబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లమూడి గ్రామ సమీపంలో ఉన్న పాండవుల గృహాలను నాయకపోడు సేవా సంఘం కుల పెద్దలు, స్థానిక గ్రామస్తుల ఆధ్వర్యంలో సందర్శించారు. నాయకపోడు కులస్థుల చారిత్రక మూలాలు, సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధం కలిగి ఉన్నాయని భావిస్తున్న ఈ ప్రాచీన ప్రదేశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాయకపోడు సేవా సంఘం నాయకులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తంబళ్ల రవి మాట్లాడుతూ.. నాయకపోడు కులస్థులకు పాండవుల కాలం నాటి చరిత్రతో విశిష్టమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. తమ పూర్వీకుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఆనవాళ్లు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయని తెలిపారు.
నల్లమూడి గ్రామ సమీపంలోని పాండవుల గృహాలు కేవలం ప్రాచీన ప్రదేశాలు మాత్రమే కాకుండా, తమ కుల చరిత్రను, పూర్వీకుల సంప్రదాయాలను గుర్తుచేసే ప్రదేశాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక ప్రదేశాలను పరిరక్షించి, భావితరాలకు వాటి ప్రాధాన్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
రానున్న రోజుల్లో నాయకపోడు కులస్థుల ఆధ్వర్యంలో ఈ ప్రదేశంలో నిత్య పూజలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు తంబళ్ల రవి తెలిపారు. ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, ప్రాచీన ఆనవాళ్ల పరిరక్షణకు కులస్థులు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

