వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి.. ఆగస్టు 1 నుంచే మోటర్లు నడుస్తున్నాయి
మూడు పంపులతో 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. కాలువలకు 2,100 క్యూసెక్కుల నీటి విడుదల
తప్పుడు ఆరోపణలపై వాస్తవాలను వెల్లడించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 8 2026: రైతులకు సాగునీరు అందించడం లేదని, కృష్ణానదిలో వరదలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం నీటిని వినియోగించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నీటిపారుదల వ్యవస్థలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను తెలుసుకోకుండా రాజకీయ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 1 నుంచే లిఫ్ట్-1 ద్వారా నీటి ఎత్తిపోతలు
ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-1 పంపుల ద్వారా 2026 ఆగస్టు 1 నుంచే నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు శ్రీశైలం నుంచి 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని వెల్లడించారు. ఎల్లూరు రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 0.355 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.34 టీఎంసీల నీరు ఉందన్నారు. సింగోటం రిజర్వాయర్ సామర్థ్యం 0.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.40 టీఎంసీల నీరు ఉన్నట్లు వివరించారు.
లిఫ్ట్-2లో మూడు పంపులు పనిచేస్తున్నాయి
లిఫ్ట్-2 ద్వారా కూడా ఆగస్టు 1 నుంచే నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని మేఘారెడ్డి తెలిపారు. జొన్నలబొగడ రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 2.14 టీఎంసీలు కాగా, ఆగస్టు 7 నాటికి నీటి మట్టం 404.80 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 407.00 మీటర్లు, ప్రస్తుత నిల్వ 1.753 టీఎంసీలు గా ఉందన్నారు. మూడు పంపుల ద్వారా 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,100 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోందని, అంటే మూడు పంపులు పనిచేస్తూ నీటిని ఎత్తిపోస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదే సమయంలో 29వ ప్యాకేజీ కల్వకుర్తి ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 8న 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
లిఫ్ట్-3 ద్వారా కూడా ఆగస్టు 6 నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని మేఘారెడ్డి తెలిపారు. గుడిపల్లిగట్టు రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 0.62 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.42 టీఎంసీల నీరు ఉందన్నారు.
అన్ని కాలువలకు సాగునీటి విడుదల
ఆగస్టు 7న అన్ని కాలువలకు సాగునీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 8 ఉదయం గుడిపల్లి రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తి సాగునీటిని కాలువలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇన్ని వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ మోటర్లు ఆన్ చేయలేదని, రైతులకు నీరు ఇవ్వడం లేదని ఆరోపించడం సరికాదని మేఘారెడ్డి అన్నారు. ప్రెస్‌మీట్ నిర్వహించే ముందు కనీసం క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
రైతుల కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రచారం కోసం కాకుండా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మేఘారెడ్డి అన్నారు. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పంపులు ఎప్పుడు ప్రారంభించామో తేదీలతో సహా చెబుతున్నామని, ఎంత నీటిని ఎత్తిపోశామో, రిజర్వాయర్లలో ఎంత నీరు ఉందో, కాలువలకు ఎప్పుడు నీటిని విడుదల చేశామో లెక్కలతో వివరిస్తున్నామని అన్నారు. ఇదే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
నీటి విషయంపై రాజకీయ విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఎమ్మెల్యే సూచించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు వాస్తవాలను పరిశీలించాలని, తన వివరాల్లో ఏదైనా తప్పు ఉందని భావిస్తే చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తున్నారని మేఘారెడ్డి తెలిపారు. రైతులు సాగుచేసిన పంటలను ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక జాతీయ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలంటే సంబంధిత అనుమతులు అవసరమనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.


