పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 29 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (VGPPS)లో భాగంగా తొలి గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, రైతుల అభివృద్ధికి చేపట్టాల్సిన పలు పనులపై చర్చించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా బోరుబావుల రీచార్జ్ పిట్స్, నీటి నిల్వ కుంటలు, ఫారం పాండ్స్, ఇంకుడు గుంతలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, పండ్ల తోటల ఏర్పాటు వంటి పనులకు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు. అలాగే రైతులకు ఉపయోగపడే బర్ల షెడ్లు, గొర్ల షెడ్లు, నాటు కోళ్ల పెంపకం వంటి పనులను కూడా ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టేందుకు అవకాశం ఉందని వివరించారు. గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి గ్రామపంచాయతీ ఆమోదం పొందిన అనంతరం గ్రామసభ ద్వారా పనులను చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ పథకం ద్వారా గ్రామంలో ఉపాధి కూలీలకు పనులు కల్పించే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 8వ తేదీ వరకు రెండో గ్రామసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటిలోగా గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబం సంబంధిత పనులకు దరఖాస్తులు సమర్పించాలని సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం కోరారు. ఈ గ్రామసభలో మండల ప్రోగ్రాం అధికారి (ఏపీఓ) సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఉపసర్పంచ్ రాములమ్మ, వార్డు సభ్యులు నరేష్, పద్మ, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ తిక్కన్న, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
