గంగిరెద్దుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
గంగిరెద్దుల సంఘం నాయకుడు జిడ్డు చిన్న నరసింహ డిమాండ్
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి, ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని గంగిరెద్దుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని గంగిరెద్దుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని బుర్ర వాగు స్టేజి సమీపంలో దాదాపు 40 సంవత్సరాలుగా బొంత గుడిసెల్లో నివసిస్తున్న గంగిరెద్దుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో నివసిస్తున్న గంగిరెద్దుల కుటుంబాలకు కూడా కనీస వసతులు అందడం లేదని వారు తెలిపారు. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నాయకులు తమ వద్దకు వచ్చి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల సంఘం నాయకుడు జిడ్డు చిన్న నరసింహ మాట్లాడుతూ… గంగిరెద్దులను ఆడిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమ వర్గం అత్యంత నిరుపేద స్థితిలో ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని పేర్కొన్నారు. మోజర్ల గ్రామం బుర్ర వాగు స్టేజి వద్ద నివసిస్తున్న 5, 6 గంగిరెద్దుల కుటుంబాలను (30 మంది) ప్రభుత్వం గుర్తించి వారికి పక్కా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే మండలంలోని అన్ని గంగిరెద్దుల కుటుంబాల వివరాలు సేకరించి వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

