పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఆర్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి బి గోపాల్ రావు ఆసుపత్రుల్లో అవసరమైన మందుల నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి ఖమ్మం: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. శనివారం రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ల్యాబ్ సేవలు, మెడికల్ వార్డులు, రోగుల నమోదుతో పాటు ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. క్యాజువాలిటీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మందులు, పరీక్షలు, చికిత్సలు సకాలంలో అందుతున్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రిలోని ఔషధ నిల్వల గదిని పరిశీలించిన కలెక్టర్, అత్యవసర మందులతో పాటు సాధారణంగా వినియోగించే అన్ని రకాల మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా పటిష్టమైన నిల్వల నిర్వహణ చేపట్టాలని సూచించారు. మందుల కొరత కారణంగా ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికతో స్టాక్ ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ పరీక్షలు, డయాగ్నస్టిక్ హబ్ సేవలను సమర్థవంతంగా వినియోగించి రోగులకు అవసరమైన పరీక్షల ఫలితాలను వీలైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. పరీక్షల నివేదికలు ఆలస్యమైతే చికిత్స కూడా ఆలస్యమవుతుందని, అందువల్ల సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, రోగులు కూర్చునే ఏర్పాట్లు, మౌళిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు నమ్మకమైన ఆరోగ్య సేవల కేంద్రాలుగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ప్రత్యేక వైద్య విభాగానికి సంబంధించిన సేవలు, వైద్యుల అందుబాటు రోజులు, పరీక్షల వివరాలు, చికిత్స విధానాలు, మందుల నిల్వల సమాచారం ఆసుపత్రి ఆవరణలో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట రఘునాథపాలెం తహసీల్దారు శ్వేత, ఎంపీడీవో అశోక్ సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.

