ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత..
విద్యాశాఖకు రూ.20 వేల కోట్ల కేటాయింపు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన 30వ యువజనోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యాశాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించడం ప్రభుత్వానికి విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా, అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించాలన్నది ముఖ్యమంత్రి సంకల్పమని తెలిపారు. ముఖ్యమంత్రి మానసపుత్రికగా భావిస్తున్న TPS పాఠశాలల ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు సైతం నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు. విద్యలో ఆర్థిక అసమానతలు తొలగించి ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, విద్యార్థులకు అందిస్తున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. యువత విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని, తమలోని ప్రతిభను వెలికితీసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. యువత సాధించే విజయాలే సమాజ అభివృద్ధికి పునాదులని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి SLN రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


