దెబ్బతిన్న చెరువులు, నీటమునిగిన పంట పొలాల పరిశీలన.. ప్రాణనష్టం జరగకుండా అధికారుల సమష్టి కృషి
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి రిపోర్టర్ ఎం నాగార్జున,నవంబర్ 5: మురసు తుపాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చెరువులు దెబ్బతినడంతో పాటు పంట పొలాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద ప్రభావిత ,ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమాయితో కలిసి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 36 గంటలుగా రెండు జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమయస్ఫూర్తితో స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయని అభినందించారు.
అయితే భారీ వర్షాల కారణంగా రహదారులు, విద్యుత్ సరఫరా, నీటిపారుదల వ్యవస్థలతో పాటు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి వివరించారు. సుమారు నాలుగైదు చిన్న నీటిపారుదల చెరువులు దెబ్బతిన్నాయని, మల్లెపూల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగుకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు నీటమునిగాయని పేర్కొన్నారు.
దమ్మపేట సమీపంలోని పెరంటాల చెరువుల నుంచి సర్‌ప్లస్ నీరు ఉధృతంగా ప్రవహించడంతో చెరువులు దెబ్బతినడంతో పాటు సమీప కాలనీపై ప్రభావం పడిందని తెలిపారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, పంట నష్టంపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట, అశ్వారావుపేట మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


