దహన సంస్కారాల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత
పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 24: దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని గౌతమ్ బుద్ధ సేవా సమితి సభ్యులు పరామర్శించారు. విషయం తెలుసుకున్న సమితి సభ్యులు పాలడుగుల అబ్బులు, ఎస్కే అజీమ్, రొయ్యల కుమార్ గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల నిర్వహణ నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా..
గౌతమ్ బుద్ధ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలు, నిరుపేద కుటుంబాలు, ఆపదలో ఉన్న బాధితులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో దహన సంస్కారాలు నిర్వహించలేని కుటుంబాలకు పరిస్థితిని బట్టి ఆర్థిక సహాయం అందిస్తూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటడం, పేదలకు అవసరమైన సమయంలో చేయూత అందించడం తమ సేవా సమితి ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని గౌతమ్ బుద్ధ సేవా సమితి సభ్యులు వెల్లడించారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సమితి సభ్యులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.


