పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక & పొలిటికల్ న్యూస్ 9 టీవీ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ స్టేట్స్ బ్యూరో: యర్ర నాగరాజు రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” సదస్సులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం, రాప్తాడు నియోజకవర్గ పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “రాప్తాడు మనదే.. రాష్ట్రం మనదే.. ప్రజలంతా మనవైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మనల్ని ఎవరూ ఆపలేరు” అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పాలకులు ప్రజల సమస్యలను విస్మరించి భూముల వివాదాలు, అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్ల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గాన్ని దోపిడీ కేంద్రంగా మార్చారని, ప్రజలు ఈ పరిస్థితులను గమనిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్, నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చలేదని అన్నారు. రైతులకు గతంలో అందిన పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు, వ్యవసాయ సహాయాలు ప్రస్తుతం అందడం లేదని తెలిపారు. పేరూరు డ్యామ్‌కు నీటిని తీసుకురావడంలో తమ పాత్ర కీలకమని, ఆ నీటి వల్ల వేలాది బోర్లు రీచార్జ్ అయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం నీటి నిర్వహణలో వైఫల్యాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా, ప్రెస్‌మీట్లు, ప్రజా సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయాన్ని సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా, “రాబోయేది జగన్ ప్రభుత్వమే.. రాప్తాడులో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే.. ఫ్యాన్ మళ్లీ గిరగిరా తిరుగుతుంది” అని పేర్కొంటూ ఈ నెల 12న నిర్వహించే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాప్తాడు మనదే..! రాష్ట్రం మనదే..! – మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
RELATED ARTICLES
