పంటలకు సకాలంలో నీరందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మండల కాంగ్రెస్ నాయకులు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 9 2026: పెద్దమందడి రైతులు నారుమళ్లు వేసుకున్న పరిస్థితులను గుర్తించి పంటలకు సకాలంలో నీరందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం పెద్దమందడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ వానాకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఆగస్టు మొదటి నుంచే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి కెనాల్ కాలువల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా బుద్ధారం కెనాల్‌కు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు.
జూరాల నుంచి నీటి విడుదల
ఖిల్లా గణపుర్–పెద్దమందడి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం సుమారు 11.94 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజ్ 6.798 టీఎంసీలు, డెడ్ స్టోరేజ్ 5.143 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు అందుబాటులో ఉండటంతో ఆగస్టు ప్రారంభంలోనే నీటిని విడుదల చేసే అవకాశం ఏర్పడిందన్నారు. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా బుద్ధారం కెనాల్‌కు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో వనపర్తి జిల్లాలోని గోపాల్పేట, ఖిల్లా గణపుర్, పెద్దమందడి మండలాల పరిధిలోని పలు చెరువులు నిండే అవకాశం ఉందన్నారు. రైతులకు నాడు–నేడు ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా ఉంటుందని పేర్కొన్న ఆయన, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రైతులను తప్పుదోవ పట్టించే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావడం సాధ్యం కాదని విమర్శించారు.
వైఎస్సార్ హయాంలో కాలువల నిర్మాణం
పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ… ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భారీ బడ్జెట్‌తో కెనాల్ కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విడతల వారీగా పేజ్–2లో భాగంగా బీడు భూములకు సాగునీరు అందించేలా కాలువలను ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించారని తెలిపారు. అలాగే కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం రిజర్వాయర్, ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, జొన్నలబొగుడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గుడిపల్లిగట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మీదుగా నీటిని ఎత్తిపోసి గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌కు తరలించే విధానం ఉందన్నారు. గుడిపల్లిగట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 0.96 టీఎంసీలు అని, అక్కడి నుంచి కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. రైతులు నారుమళ్లు వేసుకున్న నేపథ్యంలో వారికి సకాలంలో నీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
పెద్దమందడి మాజీ ఎంపీపీ టి. రఘు ప్రసాద్ మాట్లాడుతూ… వానాకాలం సీజన్లో రైతులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆగస్టు ప్రారంభంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చెరువులను నింపేందుకు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కెనాల్ పనులకు సంబంధించి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఎనిమిది నెలల గడువులో పూర్తి చేయాల్సిన పనులను రైతుల ఇబ్బందులను గుర్తించి మూడు నెలల్లోనే పూర్తి చేయించారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను వనపర్తి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, అందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను గద్దె దించి రైతు బిడ్డ తూడి మేఘారెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకున్నారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు (బంగ్లా బాబు) ఆర్. జగదీశ్వర్ రెడ్డి, పెద్దమందడి సర్పంచ్ సూర్య గంగారవి, ఉప సర్పంచ్ ఉసన్న యాదవ్, మంగంపల్లి సర్పంచ్ రమేష్ నాయక్, వెంకట్రామ్ రెడ్డి, అనకయిపల్లి తండా సర్పంచ్ ఆంజనేయులు నాయక్, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, రాఘవేందర్, డీలర్ ఎం. శ్రీనివాసులు, వడ్డే శేఖర్, మిల్లర్ రాజు, నీళ్లం రవి యాదవ్, అమ్మపల్లి బాలు, ఆల్వాల్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




