ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం
సమస్య పరిష్కారం కాకపోతే నిరసన దీక్షలు.. అసెంబ్లీ ముట్టడి తప్పదు: సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 1 2026: వనపర్తి జిల్లాలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్నూరు రవీందర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి” అని మున్నూరు రవీందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి సహా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రాన్ని వెనుకకు నెట్టడం దురదృష్టకరమని అన్నారు. అధిష్టానాన్ని ఆదుకోవడానికే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, అయితే రాష్ట్రంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. “ఇక్కడ మీ పాలనకే దిక్కులేదు.. మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థులు, యువతను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సైతం యువతను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని, విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్నూరు రవీందర్ డిమాండ్ చేశారు. “విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సమస్య పరిష్కారం అయ్యే వరకు బీజేపీ ప్రజా ఉద్యమం కొనసాగుతుంది” అని మున్నూరు రవీందర్ స్పష్టం చేశారు.

