పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వరంగల్ రూరల్ జిల్లా కాజీపేటలో దారుణ ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియా వాడకం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ్యసనం చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. వివాహేతర సంబంధం మానుకోవాలని కన్నతల్లికి కొడుకు హితవు పలికాడు. అయినా కన్నతల్లిపై వినకపోవడంతో కొడుకు కక్షగట్టి దారుణానికి ఒడిగట్టాడు. క్షణికావేశంలో గొంతుకోసి ఆమెను అతి కిరాతకంగా హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు, కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కాజీపేట పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో నాగుల సుధాకర్, ఉదయశ్రీ దంపతులు తమ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరికి ఒక కుమారుడు (దొరబాబు), ఒక కూతురు సంతానం ఉన్నారు. వీరితో పాటు సుధాకర్ తల్లి కూడా అదే ఇంటిలో కలిసి ఉంటున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం సుధాకర్ స్థానిక ప్రైవేట్ కంపెనీలో అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.*అయితే, భార్య ఉదయశ్రీ గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ కాలం గడుపుతోంది. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తితో ఉదయశ్రీకి పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త, పిల్లలను పట్టించుకోకుండా ఆమె సదరు ప్రియుడితో చనువుగా ఉండసాగింది.* అంతేకాకుండా, భర్తను, కుటుంబాన్ని వదిలేసి ప్రియుడితో కలిసి వేరే కాపురం పెట్టాలని కూడా వారు ప్లాన్ చేసుకున్నారు. ఈ తరుణంలోనే గురువారం రోజున ఇంట్లో వాళ్లకు ఏదో చెప్పి ఉదయశ్రీ బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆమె కుమారుడు దొరబాబు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తల్లి ప్రవర్తనతో కుటుంబ పరువు పోతుందనే ఆవేదనతో ఆమెను ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అక్రమ సంబంధం పెట్టుకోవడం సరికాదని, ఈ పద్ధతి మానుకోవాలని కన్నీళ్లతో బ్రతిమిలాడి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఉదయశ్రీ తన తీరు మార్చుకోకపోగా, ససేమిరా అంటు మొండికేసింది. ప్రియుడి వద్దకే వెళ్తానని తేల్చిచెప్పడంతో కొడుకు దొరబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశం కట్టలు తెంచుకోవడంతో విచక్షణ కోల్పోయి.. ఇంట్లోనే ఉన్న ఆయుధంతో తల్లి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఉదయశ్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు దొరబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సెంట్రల్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, స్థానిక సీఐ శ్యామ్ సుందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడు దొరబాబు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి

