చౌకబారు విమర్శలకు అభివృద్ధే సమాధానం
రూ.40 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు
రూ.36 కోట్లతో ఆసుపత్రి అభివృద్ధి, రూ.200 కోట్లతో సమీకృత పాఠశాల నిర్మాణం

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 08 2026: అశ్వారావుపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆశుపాక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆశుపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకుల సమక్షంలో వెయ్యి రోజుల పాలన పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్, యువ నాయకుడు జూపల్లి రమేష్ బాబు హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అయితే కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసిన తర్వాత కూడా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విమర్శలకు మాటలతో కాదు.. అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతున్నామని స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము చేసిన అభివృద్ధిని, తీసుకొచ్చిన నిధులను ప్రజలకు చెప్పుకునే హక్కు ఉంటుందని, కానీ నిధులు తీసుకురాకుండా కేవలం విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. తాము తీసుకొచ్చిన నిధులు, జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయని పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు చేయని స్థాయిలో ప్రస్తుత ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రమేష్ బాబు అన్నారు. ఓసీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఏమాత్రం తీసిపోని విధంగా జారే ఆదినారాయణ అభివృద్ధి చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. అశ్వారావుపేట మండలంలో రోడ్ల విస్తరణకు దాదాపు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయించి, రోడ్ల విస్తరణ పనులను కళ్లకు కట్టినట్లు చేపట్టారని తెలిపారు. గతంలో సమస్యలుగా ఉన్న రహదారుల పరిస్థితిని మార్చే దిశగా పనులు జరుగుతున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి దాదాపు రూ.36 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించే వారు ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి పనులను పరిశీలించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు దాదాపు పది మంది వైద్యులను అందుబాటులోకి తీసుకురావడంలో ఎమ్మెల్యే జారే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. పట్టణంలో చేపడుతున్న మధ్య దీపాల ఏర్పాటు పనులు కూడా ప్రజల కళ్లముందే కనిపిస్తున్నాయని చెప్పారు. మున్సిపాలిటీగా ఏర్పడకముందు పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోనే దాదాపు రూ.4 కోట్లతో మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు నిర్మించినట్లు వివరించారు. ఇక గురుకుల పాఠశాల, సమీకృత పాఠశాల నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్ల నిధులను మంత్రుల సహకారం, ముఖ్యమంత్రి దీవెనతో తీసుకువచ్చి పనులు వేగంగా కొనసాగిస్తున్నామని రమేష్ బాబు తెలిపారు. విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు. వెయ్యి రోజుల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసిన తర్వాత కూడా చౌకబారు విమర్శలు చేయడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని రమేష్ బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. మాటలతో రాజకీయాలు చేసే వారికి పనులతోనే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


