రావినూతలలో భూ వివాదాలపై తీవ్ర ఆరోపణలు.. మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయంటూ ఫిర్యాదుదారుల ఆవేదన
- బోనకల్ మండలం, రావినూతల:
రావినూతల గ్రామ పరిధిలో భూములకు సంబంధించిన వివాదాలపై కొందరు పట్టాదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. తమ భూముల విషయంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి మల్లు నందిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లను కొందరు వ్యక్తులు తమకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ ప్రస్తావిస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
తమ భూముల సమస్యపై మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆశ్రయించిన సమయంలో అధికారులు స్థల పరిశీలనకు వచ్చినప్పుడు కూడా రాజకీయ ప్రముఖుల పేర్లు చెప్పి అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగిందని వారు పేర్కొంటున్నారు.
“మాకు మంత్రుల అండదండలు ఉన్నాయి.. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
🔴 బాధితుల డిమాండ్
పట్టాదారు భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను అధికారులు పూర్తిగా పరిశీలించి, సర్వే నంబర్లు, పట్టాదారు పాస్‌బుక్స్, రిజిస్ట్రేషన్ రికార్డులు, ప్రభుత్వ భూముల వివరాలను బహిరంగంగా పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు.
అలాగే భూ ఆక్రమణలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరిపి, నిజానిజాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


