*నవ శిశువు భవిష్యత్తు
వైద్యుల నిర్లక్ష్యం ..వైకల్యానికి బలి ..!!

పొలిటిల్ డైలీ దినపత్రిక పి ఎన్ ఆర్ 9 టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
+ పసికందు ప్రాణాలతో ప్రభుత్వ డాక్టర్ చెలగాటం
+ ఖమ్మం ‘ఎంసీహెచ్’లో వైద్యుల నిర్లక్ష్యం
+ చిన్నారి ఎడమ చేయి తొలగింపు!
+ క్యాన్ లా సెప్టికైనా గుర్తించని ఖమ్మం ‘ఎంసీహెచ్’ వైద్యురాలు
+ ఆయింట్‌మెంట్‌తో సరిపెట్టుతూ.. రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలింపు
+ మంత్రి పొంగులేటి చొరవతో నీలోఫర్‌లో సర్జరీ..
+ కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..
+ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఖమ్మం : ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వస్తాం… కానీ ఖమ్మం ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రాని (ఎంసీహెచ్)కి వస్తే ప్రాణమే అపాయంలో పడుతుందని ఓ చిన్నారి తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. వైద్యురాలి అనాలోచిత నిర్ణయం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసికందు తన ఎడమ చేతిని శాశ్వతంగా కోల్పోయాడు. సెలైన్ సూది (క్యాన్ లా) వికటించి సెప్టికై చేయి దెబ్బతింటున్నా (గ్యాంగ్రీన్) కనీసం పట్టించుకోని వైద్యులు.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా బాధితులను హైదరాబాద్‌కు పంపించి చేతులు దులుపుకున్నారు.
వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన రేణుక, సత్యకాంత్ దంపతులకు మార్చి 3వ తేదీన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏడో నెలలోనే కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు 3 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉండగా, మరొకరు కేజీ 200 గ్రాముల బరువుతో అత్యంత బలహీనంగా పుట్టారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో.. కన్నప్రేమను గుండెల్లో దాచుకుని, నమ్మకంతో మార్చి 4వ తేదీన ఖమ్మం ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేర్చారు. అక్కడ బాబును ఇన్‌క్యుబేటర్ (బాక్స్)లో ఉంచి ప్లేట్‌లెట్స్, రక్తం ఎక్కించడం ప్రారంభించారు. ఇద్దరు పిల్లలు కావడంతో తల్లి రేణుక ఇంటి వద్దే ఒక బాబును చూసుకుంటుండగా.. ఆసుపత్రిలో తక్కువ బరువున్న బాబు దగ్గర కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పెద్దమ్మ చిర్రా విజయకుమారి దగ్గరుండి చూసుకుంది. అయితే కేవలం డైపర్ మార్చడం, ఫీడింగ్ ఇవ్వడానికి తప్ప బాబు దగ్గరకు ఎవరినీ రానివ్వని పరిస్థితి.
– ఆయింట్‌మెంట్‌తో కాలయాపన!
చికిత్స పొందుతున్న 18 రోజుల తర్వాత.. బాబు ఎడమ చేతికి క్యాన్ లా పెట్టి ఉన్న చోట తీవ్రంగా వాపు రావడాన్ని విజయకుమారి గమనించింది. వెంటనే డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె అత్యంత నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ “దానికేం కాదులే” అని ఓ సాధారణ ఆయింట్‌మెంట్ రాసి సరిపెట్టింది. రెండు మూడు రోజులు గడిచినా వాపు తగ్గకపోగా చేయి దెబ్బతిని నల్లబడుతుండటంతో విజయకుమారి మళ్లీ వైద్యురాలిని ప్రశ్నించింది. అయినా ఆ డాక్టర్ నిర్లక్ష్యం వీడలేదు.. అది కేవలం ‘ఎల్బో’ వాపు అని నమ్మబలికి, అనుమానం ఉంటే ప్రైవేట్‌లో స్కానింగ్ చేయించుకుని రావాలంటూ పంపింది. ప్రైవేట్ సెంటర్‌లో స్కానింగ్ చేయించగా.. బాబు చేయి అస్సలు కదలడం లేదని, పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని అక్కడి సిబ్బంది హెచ్చరించారు.
– తప్పు కప్పిపుచ్చుకునేందుకు ‘నీలోఫర్’ డ్రామా…
చేయి గ్యాంగ్రీన్ (కణజాల క్షీణత) బారిన పడి దెబ్బతింటోందని రిపోర్టుల ద్వారా గ్రహించిన విజయకుమారి ఆసుపత్రి సిబ్బందిని గట్టిగా నిలదీసింది. ఖమ్మం ఆసుపత్రిలో 22 రోజుల పాటు ఉంచి చికిత్స చేసిన వైద్యులు, తమ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని భయపడి.. అది కేవలం సాధారణ వాపేనని, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి వెళ్తే పెద్ద డాక్టర్లు ఉంటారు, చిటికెలో నయమవుతుందని మభ్యపెట్టారు. మార్చి 26వ తేదీ రాత్రికి రాత్రే అంబులెన్స్ మాట్లాడి హైదరాబాద్‌కు సాగనంపారు.
– మంత్రి పొంగులేటి మానవత్వం!
హైదరాబాద్ నీలోఫర్ లో చేరిన బాధితులకు అక్కడ ఘోరమైన నిజం తెలిసింది. బాబు ఎడమ చేయి పూర్తిగా నశించిందని, ఇన్ఫెక్షన్ ప్రాణాల మీదకు రాకముందే చేయి తీసేయాలని వైద్యులు తేల్చి చెప్పారు. కానీ బాబు బరువు అప్పటికి కేవలం 2.5 కేజీలు మాత్రమే ఉండటం, ప్లేట్‌లెట్స్ తీవ్రంగా హెచ్చుతగ్గులు అవుతుండటంతో శస్త్రచికిత్స చేయడానికి ఏ డాక్టరూ ముందుకు రాలేదు.
దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబం తమ బంధువుల ద్వారా తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఆశ్రయించింది. పసికందు పరిస్థితిపై మంత్రి పొంగులేటి తీవ్రంగా చలించిపోయారు. వెంటనే తన వైద్య వ్యవహారాల పీఏ పాలకుర్తి వెంకటేశ్వర్లును రంగంలోకి దించి, నీలోఫర్ ఆసుపత్రి ఉన్నతాధికారులతో మాట్లాడించారు. మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో.. ప్రత్యేక వైద్య బృందం మే 12వ తేదీన బాబుకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలు కాపాడింది.
– న్యాయం జరిగే వరకు వదిలేదే లేదు : తల్లి రేణుక
ప్రస్తుతం బాబు ప్రాణాపాయం నుండి బయటపడినప్పటికీ.. ఖమ్మం ఎంసీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి ఎడమ చేయి చంక భాగం వరకు కోల్పోయి జీవితాంతం అంగవైకల్యంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుట్టిన కొన్ని రోజులకే తమ బిడ్డ జీవితాన్ని వైకల్యం చేసిన ఖమ్మం ఎంసీహెచ్ వైద్యురాలిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అని బాధిత కుటుంబం వివరించారు
