పాలమూరు ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలో జరిగిన పనులపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో బాజా శేఖర్ జూన్ 05 2026: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ హయాంలో రూ.35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా ?.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ?. రూ.27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడు. రూ.52,121 కోట్లు సాగు నీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీ, అసలు కింద చెల్లించామని చెబుతున్న రేవంత్ రెడ్డి, దమ్ముంటే దానికి సంబంధించిన వివరాలు విడుదల చేయాలి. పాలమూరు పర్యటనలో మీడియా ప్రశ్నకు టీఎంసీ అంటే గతంలో పదివేల ఎకరాలుగా, ఇప్పుడు 15 వేల ఎకరాలుగా లెక్కకడుతున్నారు అని చెప్పడం మరో పచ్చి అబద్ధం. ఇదే మాట కేంద్ర జలసంఘం సమావేశాల్లో చెబితే పరువు పోవడమే కాకుండా, టీఎంసీకి 15 వేల ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుంది. రేవంత్ రెడ్డి అబద్ధాలు లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాల్వల టెండర్లు రద్దు చేయడం కారణంగా ఇప్పుడు రూ.4 వేల కోట్ల భారం పెరగడం నిజం కాదా?. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ పాలనలోనే కాదా?. కమీషన్ల కోసమే పంపులు, లిఫ్టులు పూర్తి చేశారు అని రేవంత్ చెప్పడం ఆయన అజ్ఞానానికి, అవగాహనా రాహిత్యానికి నిదర్శనం ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు, లిఫ్టు పనులే.. ఈ మాత్రం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమా తదితర పథకాల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని కాలువలు తవ్వి పంపులు, లిఫ్టు పనులను గాలికి వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటికీ అప్పటి పనులు రద్దు చేయలేని, కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నది. 2006లో కాంగ్రెస్ వదిలేసిన కేఎల్ఐ ఎత్తిపోతల పనులను 2016లో బీఆర్ఎస్ పూర్తి చేసింది వాస్తవం కాదా!. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం 27,100 ఎకరాల భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించడం జరిగింది.. భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు.. ఆర్టీఐలో ఆరితేరిన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు ధరఖాస్తు చేసి వివరాలు తెప్పించుకోవాలి. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్సుల వ్యవస్థను రద్దు చేసింది కేసీఆర్ హయాంలోనే.. దాని స్థానంలో చేసిన పనులకు బిల్లులు చేసే పద్దతి తీసుకువచ్చారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి 30 నెలల్లో ప్రాజెక్టుల పూర్తి చేసింది ఏంటి ?. 30 నెలల్లో మూడు లక్షల కోట్లు అప్పుచేసిన రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టుల్లో తట్ట మట్టి ఎత్తకుండా తీరిగ్గా పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పాత అబద్దాలనే వల్లె వేశాడు. పాలమూరు పర్యటనలో ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్రం వెనక్కి పంపిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు ?. సీఎం స్థాయిని మరచి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనలో అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అబద్ధాలు చెప్పడానికి రెండు రోజుల పర్యటన ఎందుకు ? హైదరాబాద్ లోనే ఇదే స్క్రిప్టు చదివితే ప్రజలకు కొంచెం భారమైనా తగ్గేది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని వారన్నారు.
