-ఉదయం 10 గంటలకు గన్ పార్క్ నుంచి ర్యాలీ ప్రారంభం
-అధిక సంఖ్యలో పాల్గొనాలని జర్నలిస్టులకు మామిడి సోమయ్య పిలుపు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి హైదరాబాద్, జూన్ 15: జర్నలిస్టుల సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 18వ తేదీన జర్నలిస్టుల”ఛలో హైదరాబాద్”
కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)
వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ కు తరలివచ్చే జర్నలిస్టులతో అసెంబ్లీ వద్ద గల గన్ పార్క్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో జర్నలిస్టులతో పాటు, వివిధ పత్రికల నిర్వహకులు, కేబుల్ టీవీ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల పట్ల స్వరాష్ట్రంలోనే పాలకుల వివక్ష కొనసాగుతుందని, ముఖ్యంగా చిన్న మధ్య తరహా పత్రికలకు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగుతుందని మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని, గత ప్రభుత్వంలో మాదిరిగానే వివక్ష కొనసాగుతుందని ధ్వజమెత్తారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ కు రెండేళ్ళుగా అడ్వర్టైజ్మెంట్ బిల్లులు ఇవ్వలేదని,అడ్వర్టైజ్మెంట్స్ తగ్గించారని అన్నారు. అన్ని మీడియా సంస్థలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్ వెంటనే ఇవ్వాలని, చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్రికలకు ఎంప్యానల్ తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక అడ్వర్టయిజ్మెంట్ ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్ కోసం ఒక ఎకరం భూమిని ప్రభుత్వ నామినల్ ధరకు ఇచ్చి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుకు రుణ సదుపాయం కల్పించాలని, చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని కోరారు.జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు, భీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు పెంచాలని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ టీవి) న్యూస్ ఛానళ్ళకు ఆక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళస్థలాల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఇంత వరకు సరైన నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నదని, ఈ ధోరణి విడనాడి కొత్త పాలసీతో అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకై ఈనెల 18న తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
