ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం సహించేది లేదు

ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం సహించేది లేదు

📰 Generate e-Paper Clip

అధికారులపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆగ్రహం

శ్రీరంగాపురం ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలపై తీవ్ర అసంతృప్తి

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతతో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: నపర్తి నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని పరిశీలించిన ఎమ్మెల్యే నేరుగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడం, తరగతి గదులు సక్రమంగా లేకపోవడం, మరుగుదొడ్లు అత్యంత దయనీయ స్థితిలో ఉండడం వంటి సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రత, కూరగాయల నాణ్యత, వంట సామగ్రి, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి విద్యార్థికి పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సహించబోమన్నారు. వెంటనే మరుగుదొడ్లను శుభ్రపరచి, నిరంతర పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం, కొన్ని గదుల్లో మౌలిక వసతులు లేకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వెంటనే ఫ్యాన్లకు మరమ్మతులు చేపట్టి, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణలో కొందరు గ్రామస్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని పేర్కొన్న ఎమ్మెల్యే, విద్యాలయ ప్రాంగణం పవిత్రమైన విద్యా కేంద్రంగా ఉండాలని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేసి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… “ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన మౌలిక వసతులు అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, సర్పంచ్ మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరి రాజు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!