మండల సర్వసభ్య సమావేశంలో పలువురు అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం
పొంతనలేని సమాధానాలతో అధికారులకు మెమోలు
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: శ్రీరంగాపురం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై అన్ని శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా అధికారులను ప్రశ్నిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీక్ష సందర్భంగా పలు శాఖల అధికారులు సరైన సమాచారం లేకుండా, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మండల విద్యాధికారి హనుమంతు విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోవడంతో మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… “రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేస్తుంటే, అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతినడం అత్యంత బాధాకరమన్నారు. ప్రజల పట్ల బాధ్యతతో పని చేయని అధికారులను ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించారు. విద్యాశాఖ పనితీరుపై సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో విఫలమైన మండల విద్యాధికారి హనుమంతుకు మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే సమావేశంలో సంబంధిత అంశాలపై స్పష్టత ఇవ్వలేని విద్యుత్ శాఖ లైన్‌మన్‌కు కూడా నోటీసు జారీ చేయాలని సూచించారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై కూడా ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన కీలక సమావేశానికి గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, సంబంధిత ఇరిగేషన్ అధికారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన వెంటనే మార్చాలని, విద్యుత్ అంతరాయాలను తగ్గించాలని సూచించారు. ఇప్పటికే విద్యుత్ శాఖ ద్వారా సుమారు రూ.140 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చామని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతు భరోసా, పంటల నమోదు, వ్యవసాయ విస్తరణ సేవలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రైతులకు ప్రతి ప్రభుత్వ పథకం సకాలంలో అందేలా అధికారులు గ్రామస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూడాలని, గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇంకుడు గుంతలు, గ్రామాభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ధరణి సంబంధిత సమస్యలు, భూ వివాదాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, రైతుల భూముల సమస్యలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం సహించబోమని హెచ్చరించారు. కాలువల నిర్వహణ, సాగునీటి పంపిణీ, పెండింగ్ మరమ్మతులు, రైతులకు సాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశాలకు గైర్హాజరయ్యే అధికారులు ప్రజలకు ఎలా జవాబుదారులు అవుతారని ప్రశ్నిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… “ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అధికారులు ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయాన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాల అమలులో నిర్లక్ష్యం, సమావేశాలకు గైర్హాజరు, ప్రజల సమస్యల పట్ల అలసత్వం ఏ మాత్రం సహించేది లేదు. పనితీరు మెరుగుపరచుకోని అధికారులపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, సింగిల్ విండో అద్యక్షులు కోదండరామిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుధారాణి. ఎమ్మార్వో ఎంపీడీవో సర్పంచులు పంచాయతీ కార్యదర్శిలు అధికారులు పాల్గొన్నారు.

