ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 9 2026: హైదరాబాద్ తెలంగాణ సాహిత్య అకాడమీలో ఆదివారం ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన “సాహిత్య సమాలోచన” గ్రంథావిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తెలుగు సాహిత్యానికి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. సమాజంలో చైతన్యం తీసుకురావడంతో పాటు ప్రజలకు దిశానిర్దేశం చేయడంలో సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన “సాహిత్య సమాలోచన” తెలుగు సాహిత్యంపై లోతైన ఆలోచనలకు, సాహిత్యాభిమానులకు ఉపయోగపడే గ్రంథంగా నిలుస్తుందని సభలో పాల్గొన్న సాహితీవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రంథావిష్కరణ సభలో సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు ఆచార్య మృణాళిని, ఆచార్య కోయ కోటేశ్వర్, నాలేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్యాభిమానులు, రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




